
ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించరూ..!
కలబురిగి నగరంలో సంఘ్ సేవకుల పథసంచలనం
ఆదివారం రాష్ట్రమంతటా ఆర్‌ఎస్‌ఎస్ సంబరాలు, బెంగళూరులో బాలల వేషధారణ
శివాజీనగర: ప్రభుత్వ స్థలాల్లో ఆర్‌ఎస్‌ఎస్ సభలు, సమావేశాలను నిషేధించాలంటూ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, ఐటీ బీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే, తమ ప్రభుత్వానికి లేఖ రాశారు. తన డిమాండును తక్షణమే పరిశీలించాలని సీఎం సిద్దరామయ్యను కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ మైదానాలలో కార్యక్రమాలు చేస్తూ పిల్లలు, యువత మనస్సులో విద్వేషాన్ని నింపుతోందని ఆరోపించారు. ఆయుధాల ప్రదర్శన జరుపుతోంది, కాబట్టి ప్రభుత్వ స్థలాల్లో ఆ శాఖ కార్యక్రమాలను నిషేధం విధించాలి అని కోరారు. సంఘ్ వందేళ్ల ఉత్సవాలు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న సమయంలో ఈ లేఖ రాయడం విశేషం.
కాంగ్రెస్ చేత కాదు: విజయేంద్ర
బాధ్యతాయుత స్థానంలో ఉన్న ప్రియాంక ఖర్గే ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలనడం మూర్ఖత్వమని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర మండిపడ్డారు. ఆదివారం నగరంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం జగన్నాథ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ అంటే తెలియనివారు, సొంత ప్రచారం కోరేవారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఆర్‌ఎస్‌ఎస్‌ని నిషేధించింది. మళ్లీ నిషేధాన్ని ఉపసంహరించుకొందని ఆయన చెప్పారు. మరోసారి ఆర్‌ఎస్‌ఎస్ ను నిషేధించే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసినట్లు కనిపిస్తోంది. సోనియాగాంధీ కుటుంబాన్ని మెప్పించే దిశలో ఈ లేఖ రాసినట్లు ఉందని హేళన చేశారు. ఖర్గే సొంత జిల్లా కల్బుర్గి అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, హత్యలు, ఇసుక మాఫియా అధికమైంది, ఆ సంగతి చూడాలన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ శ తమానోత్సవం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతమానోత్సవాల సందర్భంగా బెంగళూరులోని వివిధ చోట్ల ఆదివారం కార్యకర్తలు పథసంచలనం జరిపారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. సదా వత్సలే గీతాన్ని ఆలపిస్తూ బ్యాండు వాయిద్యాలతో కవాతు సాగింది. ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడి వీక్షించారు.
రాష్ట్ర సర్కారుకు మంత్రి ఖర్గే లేఖ
మూర్ఖత్వమన్న బీజేపీ నేతలు

ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించరూ..!