
ఇళ్ల మీద పడిన క్రేన్.. 5మందికి గాయాలు
కృష్ణరాజపురం: బెంగళూరులోని ఆవులహళ్లి ఠాణా పరిధిలోని మేడహళ్ళిలో పెద్ద క్రేన్ విరిగిపడిన ప్రమాదంలో ఐదుమంది గాయపడ్డారు. వివరాలు.. ఓ ప్రైవేటు స్కూలు పక్కన ఉన్న టవర్‌ను మరమ్మతు చేయాలని పెద్ద క్రేన్‌తో పనులు చేస్తున్నారు. ఆదివారం ఉదయం పని చేస్తుండగా క్రేన్ విరిగి పక్కనే ఉన్న అద్దె ఇళ్ల మీద పడింది. వాటిలో ఉంటున్న లాలు (30), ఖురతాబాను (19), ఇలియాజ్ (38), షమీమ్ (28) శమ్‌దేవ్ (52) అనేవారు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులు భట్టరహళ్ళి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలిని ఏసీపీ రీనా సువర్ణ పరిశీలించి కేసు నమోదు చేశారు.
మైసూరులో రాత్రివేళ
పోలీసుల సోదాలు
మైసూరు: సాంస్కృతిక నగరం మైసూరులో హత్యలు, బాలిక పై అత్యాచారం, హత్య తదితర ఘోరాలతో ప్రజల్లో కలవరం నెలకొంది. పోలీసుల అలసత్వంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో ఈ రీతిలో నేరాలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం రాత్రి నగరంలో తనిఖీలు నిర్వహించారు. రౌడీషీటర్లు, కేసుల్లో నిందితులకు హెచ్చరించారు. ప్రజల మీద దాడులకు దిగితే కఠినమైన చట్టాల కింద కేసులు తప్పవన్నారు. 405 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపి 204 మంది కోప్టా చట్టం కింద కేసులు నమోదు చేశారు. దొడ్డకెరె మైదానం, దసరా వస్తు ప్రదర్శన మైదానం, పార్కింగ్ స్థలాలు, జ్వాలాముఖి పార్కింగ్ స్థలం, బాలల ఉద్యానవనం, ఆర్‌ఎంసీ బస్టాండు తదితర ప్రాంతాల్లో నాకాబందీని జరిపారు. రాత్రివేళ బైకుల్లో త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారిని పట్టుకుని 54 కేసులు పెట్టారు. 33 మందిపై నో హెల్మెట్ కేసు నమోదు చేశారు. 59 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అడవిదున్న ముప్పుతిప్పలు
యశవంతపుర: మలెనాడు ప్రాంతానికే పరిమితమైన అడవి దున్నల దాడులు హాసన్ జిల్లాకు కూడా వ్యాపించాయి. శనివారం చన్నరాయపట్టణంలో ఓ మహిళపై దాడి చేసిన అడవి దున్నను ఆదివారం అటవీ అధికారులు పట్టుకున్నారు. ఇది మడికెరి నుంచి ఇటువైపు వచ్చినట్లు అనుమానాలున్నాయి. మార్గమధ్యలో చన్నరాయపట్టణ చుట్టుక్కల పంట పొలాలను నాశనం చేసింది. పలు కాలనీలలో తిరుగుతూ జనతాహౌస్‌లో చెట్ల పొదల్లోకి వెళ్లింది. అటవీ అధికారులు మత్తుమందు తూటాతో కొట్టాలని ప్రయత్నించారు. మూడుసార్లు తప్పించుకొంది. చివరకు ఎలాగో మత్తు మందును ఇచ్చి దానిని బంధించి వాహనంలో తరలించారు.
ఆఫ్ఘనిస్థాన్‌తో స్నేహమెందుకో?
కోలారు: తాలిబాన్ ఉగ్రవాదులు పరిపాలిస్తున్న ఆఫ్ఘనిస్థాన్‌తో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్నేహం చేస్తోందో తెలియదని శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. ఆదివారం కోలారులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటివి ఉగ్రవాద దేశాలని, ఇలాంటి దేశాలతో సాన్నిహిత్యం భారతదేశానికి మంచిది కాదన్నారు. పహల్గాం దుర్ఘటనను హిందువులు, భారతీయులు ఎన్నటికీ మరువరాదన్నారు.

ఇళ్ల మీద పడిన క్రేన్.. 5మందికి గాయాలు