
నాన్నా.. నువ్వు లేని లోకం వద్దు
గౌరిబిదనూరు: తండ్రి లేని లోకంలో ఉండలేనంటూ ఓ కూతురు తనువు చాలించింది. వివరాలు.. నగరానికి సమీపంలో ఉన్న నాగయ్యరెడ్డి కాలనీలో నివాసముంటున్న స్వర్ణ (22) బెంగళూరులోని మహారాణి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతోంది. పలు సమస్యల వల్ల ఆమె తండ్రి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. స్వర్ణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనను తలచుకుంటూ బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం బెంగళూరులోని హాస్టల్లో పురుగుల మందును తాగి, ఇంటికి వచ్చింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురికాగా తల్లి ఈమెను చిక్కబళ్ళాపురం ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ మరణించింది. కొన్నినెలల్లోనే భర్త, కుమార్తె దూరం కావడంతో తల్లి హృదయ విదారకంగా విలపించింది. బెంగుళూరు హై గ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కేసు దాఖలు చేసుకొని దర్యాప్తు చేబట్టారు.
మరో యువతి...
మైసూరు: జీవితంపైన విరక్తి కలిగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల పట్టణం మంజునాథ్ నగరలో జరిగింది. యువతి రక్షిత (19) మృతురాలు. ఆమె తండ్రి బెంగళూరులో పని చేస్తుంటారు. ఒంటరిగా ఉంటున్న యువతి అవ్వ తాత వద్ద ఉంటోంది. బీఏ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేది. ఈ సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
కులగణనలో టీచర్‌కు గుండెపోటు
బనశంకరి: బెంగళూరులో కులగణనలో ఉపాధ్యాయురాలు గుండెపోటుకు గురైంది. ఆనేకల్ తాలూకా బొమ్మసంద్రలో ఆదివారం యశోద అనే టీచర్ కులగణన సర్వేలో ఉండగా గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురైంది. వెంటనే కొందరు సమీప హెల్త్‌సిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి స్టంట్‌ను అమర్చారు. యశోద బొమ్మసంద్ర ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్‌గా పనిచేస్తోంది.