
నన్ను పిలవరా.. అతన్ని పంపించేయండి
బనశంకరి: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు నడిగే పేరుతో ఉద్యానవనాల్లో ప్రజలతో సమావేశాలను నిర్వహిస్తుండడం తెలిసిందే. ఆదివారం మత్తికెరె జేపీ పార్కులో భేటీలో రభస జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మునిరత్న తనను పిలవలేదని బైఠాయించారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దుస్తుల్లో ఎమ్మెల్యే నిరసనకు దిగారు. ఆయనను చూసి డీకే.శివకుమార్ , ఏ నల్ల టోపీ ఎమ్మెల్యే రండి అంటూ హాస్యధోరణిలో వేదికపైకి ఆహ్వానించారు. మునిరత్న వేదికపైకి వెళ్లి బలవంతంగా మైక్ తీసుకుని ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఆక్రోశించారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్తలు మునిరత్నను చుట్టుముట్టి ఇక్కడ గూండాగిరి చేయడానికి వచ్చారా, వేదిక దిగి వెళ్లిపోండి అని గద్దించారు. రేపిస్ట్, రేపిస్ట్ అని నినాదాలు చేశారు. గొడవ ముదరకుండా పోలీసులు మునిరత్న చుట్టూ నిలిచారు. కొంతసేపు గందరగోళం నెలకొంది. అతడిని ఇక్కడి నుంచి పంపించండి అని డీకే శివకుమార్ ఆదేశించారు. దీంతో పోలీసులు మునిరత్నను వేదిక పై నుంచి కొద్దిదూరం తీసుకెళ్లారు. తనపై వెనుక నుంచి ఎవరో దాడి చేశారని, టోపీని లాగేశారని మునిరత్న ఆరోపించారు. తనను కొట్టడానికి చెన్నపట్టణ, రామనగర, కనకపుర నుంచి అల్లరిమూకలను పిలిపించారని ఆరోపించారు. ఎమ్మెల్యేను పంపించాక చర్చాగోష్టి కొనసాగింది.
పార్కు భేటీలో డీసీఎం వర్సెస్ ఎమ్మెల్యే