
కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు
హొసపేటె: జిల్లా పరిపాలన, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ సహకారంతో ఈనెల 7న జరగనున్న వాల్మీకి జయంతిని బహిష్కరించాలని వాల్మీకి నాయక సమాజం నిర్ణయించిందని సంఘం అధ్యక్షుడు గోసాల భరమప్ప, ప్రధాన కార్యదర్శి దేవరమనే శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం కురుబ సమాజకులను ఎట్టి పరిస్థితుల్లో ఎస్టీలో చేర్చరాదని డిమాండ్ చేశారు. ఇందుకోసం నాయక సమాజం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోందని తెలిపారు. అయితే ఈ అంశంపై ఏ పార్టీ నాయకుడూ తన స్వరం వినిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో సమాజ స్వామిజీ సహా వాల్మీకి జయంతిలో మాత్రమే కాకుండా ఏదైన ప్రభుత్వ కార్యక్రమంలో కూడా పాల్గొకూడదని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు స్పందించక పోవడం సరికాదన్నారు. కురుబ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చితే సహించేది లేదని పేర్కొన్నారు. తమ నిరసనను కొనసాగిస్తామని,.. జయంతి తర్వాత పోరాటపై చర్చిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కిన్నాళ్ హనుమంత, బేల గోడ అంబన్న, గుడుగుడి సోమనాథ్, గుజ్జల చంద్రశేఖర్, దేవేంద్రప్ప, కరి హనుమంత, శ్రీకంఠ, వసంత్, బేలగోడ అంబన్న మల్లికార్జున పాల్గొన్నారు.