
ప్రమాద వేళలో ప్యానిక్ బటన్ ఏదీ?
సాక్షి, బెంగళూరు: క్యాబ్‌లు, ట్యాక్సీల్లో వెళ్లే డ్రైవర్లు, ప్రయాణికులకు ఏమైనా సమస్య వస్తే తక్షణ సాయం కోసం జీపీఎస్, ప్యానిక్ బటన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి క్యాబ్‌లో ఉండేలా రవాణా శాఖ తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటన తరువాత అన్ని రాష్ట్రాల్లో ఎల్లో బోర్డు వాహనాలకు జీపీఎస్, ప్యానిక్ బటన్‌ను తప్పనిసరి చేసింది. దీనిమీద క్యాబ్‌ల డ్రైవర్లు, యజమానులు అసంతృప్తి వ్యక్త చేస్తున్నారు.
6 లక్షల వాహనాల్లో 1.5 లక్షలకే
సిటీతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 6 లక్షలకు పైగా ఎల్లో బోర్డు వాహనాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు కేవలం 1.5 లక్షల వాహనాలకు మాత్రమే జీపీఎస్, ప్యానిక్ బటన్‌లు ఉన్నాయి.
క్యాబ్‌లలో కానరాని జీపీఎస్,
ప్యానిక్ మీట
మహిళల భద్రతకు లేని భరోసా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు బేఖాతరు
పాత వాహనాలకే సమస్య
కొత్తగా కొనే వాహనాలకు షోరూంలవారే జీపీఎస్, ప్యానిక్ బటన్‌ను అమర్చి ఇస్తున్నారు.
సమస్య అంతా పాత వాహనాలకే. వాటిని అమర్చాలంటే ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను చూపించాలి. ఈ నిర్ణయం మీద డ్రైవర్లు కోపంగా ఉన్నారు.
ఎల్లో బోర్డు వాహనాలకు ఎఫ్‌సీ చేసేందుకు రూ.800 చెల్లించాల్సి వస్తుంది. అలాగే ప్యానిక్ బటన్, జీపీఎస్ అమర్చేందుకు మరో రూ. 13 వేల నుంచి రూ. 16 వేల వరకు ఖర్చు అవుతోంది. ప్రతి ఏటా రెన్యూవల్ కోసం రూ. 2,200 చెల్లించాలి. ఇంత భారాన్ని భరించలేమంటున్నారు.
ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం డ్రైవర్లు పొరుగునే ఉన్న అనంతపురం, చిత్తూరు జిల్లాలకు వెళ్తున్నారు. అక్కడ చవగ్గా పనైపోతుందని చెబుతున్నారు.
ఎలా పని చేస్తుందంటే
ముఖ్యంగా మహిళలు, యువతులు ప్రయాణిస్తున్నప్పుడు భద్రతా సమస్య వస్తే ప్యానిక్ బటన్‌ను నొక్కితే సరి. ఆ సమాచారం ఆర్‌టీవో కంట్రోల్ రూమ్‌కు వెళుతోంది. కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బంది వాహన యజమాని లేదా డ్రైవర్‌కు కాల్ చేస్తారు. సమస్య ఏమిటో కనుక్కుని అవసరమైతే పోలీసులకు, ఫైర్, ఆస్పత్రులకు కాల్ చేస్తారు. 800కు పైగా మొబైల్ కాల్స్ ప్రతినిత్యం కంట్రోల్‌రూమ్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సమస్య కంటే కూడా, ఆ బటన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలమే ఉంటోందని తెలిసింది. ఇప్పటివరకు తీవ్ర సమస్య మీద కేవలం 22 కాల్స్ రాగా, వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కంట్రోల్ రూమ్ అధికారి ఒకరు తెలిపారు. ఏమైనా గానీ ఆర్థిక భారం పేరుతో డ్రైవర్లు ప్యానిక్ బటన్‌కు మొగ్గు చూపడం లేదు.
ఓ రాత్రి వేళ బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ఓ మహిళ నగరంలోని ఇంటికి బయల్దేరారు. మధ్యలో డ్రైవరు వెకిలి చేష్టలు చేయడంతో ఆమె ట్యాక్సీలోని ప్యానిక్ బటన్‌ను నొక్కింది. కాసేపటికి పోలీసులు ఆ డ్రైవర్‌కు కాల్ చేశారు.
ఇలా వాహనాలలో ప్యానిక్ బటన్ ఉంటే.. భయంతోనైనా డ్రైవర్లు, లేదా పోకిరీలు వేధింపులకు దూరంగా ఉంటారు. ఆ బటన్ లేకపోతే ఎవరైనా గానీ ఆకతాయిలు అల్లరి చేష్టలకు వెనుకాడడం లేదు. అబలల భద్రతకు ఎంతో ప్రధానమైన ప్యానిక్ బటన్ వ్యవస్థను బాలారిష్టాలు వెంటాడుతున్నాయి.

ప్రమాద వేళలో ప్యానిక్ బటన్ ఏదీ?

ప్రమాద వేళలో ప్యానిక్ బటన్ ఏదీ?