
సంతోషం పంచి.. బాధగా వీడ్కోలు
● మైసూరు గజరాజులకు బైబై
● శాస్త్రోక్తంగా నిష్క్రమణం
మైసూరు: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా సంబరాలలో పాల్గొనడానికి అడవుల్లోని శిబిరాల నుంచి వచ్చిన గజరాజులు భారమైన హృదయాలతో మైసూరువాసులకు, పర్యాటకులకు వీడ్కోలు పలికాయి. ఇక వెళ్లొస్తాం.. అంటూ అడవులకు నిష్క్రమించాయి. దసరా ఉత్సవాలలో గజరాజుల సేవలను తలచుకుంటూ అందరూ ఆవేదన చెందారు, కొందరైతే కన్నీరు కార్చారు.
పూజలు చేసి, పండ్లు తినిపించి
జంబూసవారీ వేడుకల్లో ఏనుగులు విజయవంతంగా పాల్గొని ఉత్సవాలను సంపూర్ణం చేయడం తెలిసిందే. జంబూసవారీ కోసం గజరాజులకు చేసిన రంగురంగుల బొమ్మల అలంకారం ఇంకా తడి ఆరకముందే నగరాన్ని వీడాయి. ఆదివారం ఉదయమే కెప్టెన్ అభిమన్యు సహా 14 ఏనుగులకు స్నానాలు చేయించి అర్చకులు వివిధ రకాల పూజలు చేశారు. వాటికి పండ్లు, చెరుకులను తినిపించారు. ఏనుగులు తొండాలు ఎత్తి దండాలు పెట్టాయి. వీడ్కోలు వేడుకను చూడడానికి వేలాది మంది తరలివచ్చారు. అటవీ సిబ్బంది ఒక్కో ఏనుగును ఒక్కో లారీలోకి ఎక్కించారు. లారీలు కదిలిపోతుంటే, అధికారులు, ప్రజలు అందరూ బాధగా చూస్తుండిపోయారు.
ఆగస్టు 4న వచ్చాయి
జిల్లాలోని నాగరహోళె అడవుల్లోని శిబిరాల నుంచి ఏనుగులను ఆగస్టు 4న అట్టహాసంగా గజపయన ద్వారా మైసూరుకు తీసుకువచ్చారు. అప్పటినుంచి అంబావిలాస్ ప్యాలెస్ ఆవరణలో మకాం వేసి రాచ మర్యాదలను అందుకున్నాయి. నిత్యం వేలాది మంది గజరాజులను చూసేవారు. సరిగ్గా రెండు నెలల పాటు మైసూరులో గడిపాయి. మధ్యాహ్నం నుంచి బోసిపోయిన ప్యాలెస్‌ను చూసి అందరూ బాధగా నిట్టూర్చారు.

సంతోషం పంచి.. బాధగా వీడ్కోలు

సంతోషం పంచి.. బాధగా వీడ్కోలు

సంతోషం పంచి.. బాధగా వీడ్కోలు