
కులగణనలో కుక్కల దాడి
● టీచరమ్మకు తీవ్ర గాయాలు
యశవంతపుర: జనగణన చేస్తున్న ఉపాధ్యాయులపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో జరిగింది. జైభీమ్ నగరలో ఉపాధ్యాయురాలు చిక్కమ్మ కుల సమీక్షకు వెళ్లారు. వీధి కుక్కలు ఆమెను వెంబడించి కరిచాయి. ఆమెను రక్షించడానికి వెళ్లిన ఏడు మందిపైనా స్వైర విహారం చేశాయి. భయపడిన వారు అక్కడ నుంచి పరుగులు తీశారు. తీవ్ర గాయాల పాలైన చిక్కమ్మ పట్టణంలో జిహెచ్‌పిఎస్ పాఠశాలలో పని చేస్తున్నారు. ఈ ఘటనలో శివకుమార్, ధర్మ, పృ థ్వి, సచిన్‌తో పాటు 7 మంది కూడా కుక్కల వల్ల గాయపడ్డారు. అక్కడ ఆటలాడుతున్న కిషన్ అనే బాలున్ని కరిచాయి. జనగణన చేయడానికి చిక్కమ్మకు ఆదివారం చివరి రోజు. మూడు ఇళ్లు మిగిలి ఉండగా భర్తతో కలిసి వెళ్తుండగా వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. ఆమెకు ముఖం, తల మీద తీవ్రగాయాలు తగిలాయి. బాధితులందరూ బేలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే సురేశ్ పరామర్శించారు. రాష్ట్రంలో పలువురు ఉద్యోగులు కులగణనకు వెళ్తూ ప్రమాదాల బారిన పడ్డారు.
మంత్రి స్పెషల్ ఆఫీసరు
లంచాల మోజు
దొడ్డబళ్లాపురం: ఇంధన మంత్రి పనులు చూసుకునే స్పెషల్ ఆఫీసర్ ఒకరు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడ్డ సంఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు... విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా కేపీటీసీఎల్ ఈఓ జ్యోతిప్రకాశ్ పనిచేస్తున్నారు. బ్యాడరహళ్లి నివాసి అనంతరాజు తాను నిర్మిస్తున్న లేఔట్‌కి విద్యుత్ కనెక్షన్ కోసం ఎన్‌ఓసీ కావాలని దరఖాస్తు చేశాడు. అయితే జ్యోతిప్రకాశ్ రూ.1లక్ష లంచం డిమాండు చేశాడు. దీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. రూ.50 వేలు తీసుకుంటుండగా జ్యోతిప్రకాశ్, అతని కారు డ్రైవర్ నవీన్‌ను లోకాయుక్త పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
రియాల్టీ సంస్థకు ఈడీ షాక్
● రూ. 423 కోట్ల ఆస్తుల సీజ్
బనశంకరి: రాజధానిలో రియాల్టీ సంస్థకు చెందిన రూ.423 కోట్ల విలువచేసే స్థిరాస్తులను ఈడీ జప్తుచేసింది. అక్రమ నగదు బదిలీ ఆరోపణలు రావడమే కారణమని ఈడీ తెలిపింది. ఫ్లాట్లు, ఇళ్లు ఇస్తామని జనం నుంచి రూ.927 కోట్లు వసూలు చేశారు. కానీ గడువులోగా కేటాయించలేదు. పైగా జనం నుంచి సేకరించిన డబ్బుతో కుటుంబసభ్యుల పేర్ల మీద ఆస్తులను కొనుగోలు చేశారు. ఫిర్యాదులు రావడంతో కస్టమర్ల హితాసక్తిని కాపాడేందుకు సదరు సంస్థ యజమాని వాసుదేవన్, భార్య, కుటుంబీకుల పేర్లతో ఉన్న ఇళ్లు, స్థలాలు, 4.5 ఎకరాల వాణిజ్య భూమి, మూడిగెరె కన్నెహళ్లి గ్రామంలో 179 ఎకరాల భూమి తదితరాలతో కలిపి రూ.423 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది.

కులగణనలో కుక్కల దాడి