
ప్లాస్టిక్ గోదాము మసి
దొడ్డబళ్లాపురం: గ్యాస్ సిలిండర్ పేలి ప్లాస్టిక్ గోడౌన్ కాలిబూడిదైన సంఘటన బెంగళూరులోని బేగూరులో జరిగింది. బేగూరు అక్షయ్‌నగర్‌లో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్‌లో ఆదివారం ఉదయం హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో క్షణాల్లో మంటలు గోడౌన్ మొత్తం వ్యాపించి లక్షల విలువ చేసే వస్తువులు మంటల్లో కాలిపోగా, ఆ సమయంలో జనం లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. ఫైర్ సిబ్బంది చేరుకుని 2 గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశారు. పొగ, మంటలను చూసి చుట్టుపక్కల ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు.
దగ్గు సిరప్‌లపై నిఘా
సాక్షి, బెంగళూరు: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ నాసిరకం దగ్గుమందు వల్ల 11 మంది బాలలు మరణించిన ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సదరు కోల్డ్‌రిఫ్ అనే సిరప్‌ను నిషేధించింది. ఈ మందు రాష్ట్రంలో సరఫరాలో లేకున్నప్పటికీ ఎక్కడా అమ్మరాదని ఆదేశించింది. తల్లిదండ్రులు కోల్డ్‌రిఫ్‌ను కొనుగోలు చేయకూడదని ఆరోగ్య శాఖ సూచించింది. వైద్యులు సూచించిన సిరప్‌లనే ఉపయోగించాలని తెలిపింది. కోల్డ్‌రిఫ్‌ను ఎక్కడైనా అమ్ముతున్నట్లయితే వెంటనే బంద్ చేయాలన్నారు. సరఫరా జరుగుతుందా అనే విషయాన్ని కూడా పరిశీలించాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇతర కంపెనీలకు చెందిన దగ్గు మందులను ల్యాబోరేటరీలకు పరీక్షల నిమిత్తం తరలించారు.
కన్నడనాట కల్లోలమే
● బిహార్ ఎన్నికలు అయిపోనీ: విజయేంద్ర
మైసూరు: బిహార్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత కర్ణాటక రాజకీయాల్లో అనేక మార్పులు రావడంతో పాటు కొన్ని పార్టీలలో అల్లకల్లోలం ఏర్పడుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర చెప్పారు. ఆదివారం మైసూరు నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవంబర్‌లో పెను మార్పు వస్తుందంటున్నారు, కుర్చీని కాపాడుకునేందుకు సీఎం సిద్దరామయ్య అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. అందుకే సిద్దరామయ్య ఇటీవల మైసూరులో బల ప్రదర్శన చేశారని ఆయన హేళన చేశారు. ప్రజల మధ్య ర్యాంప్ వాక్ కూడా చేస్తున్నారని, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ కంటే సిద్దరామయ్య హడావుడి ఎక్కువగా ఉందని అన్నారు. ఇదేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్న నవంబరు క్రాంతికి అర్థం ఏమిటో సీఎం చెప్పాలన్నారు. అతి త్వరలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పకపోయినా, మార్పు సంకేతాలను ఇస్తున్నారని చెప్పారు.

ప్లాస్టిక్ గోదాము మసి