
అస్తవ్యస్తంగా బళ్లారి నగరాభివృద్ధి
సాక్షి బళ్లారి: పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. బళ్లారి మహానగర పాలికె అని గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ నగరాభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది. మున్సిపాల్టీ స్థాయి నుంచి మహానగర పాలికెగా అప్‌గ్రేడ్ అయి 15 సంవత్సరాలు గడిచింది. పాలికెకు ఉండాల్సిన ఉన్నతాధికారులు కానీ ఆయా శాఖల ఇంజినీర్లు కానీ, చివరకు నగరంలో స్వచ్ఛత చేయాల్సిన పారిశుధ్య కార్మికులను తగినంత మందిని ప్రభుత్వం నియమించ లేదు. నగరాభివృద్ధి నత్తనడకన సాగుతోంది. ఓ వైపు నగరంలో రోజురోజుకు జనాభా కూడా పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. పారిశ్రామిక, స్టీల్ జిల్లా కేంద్రంగా పేరొందిన బళ్లారి నగరంలో 39 వార్డులకు గాను నగరాభివృద్ధి చేయడానికి మూడు డివిజన్లను ఏర్పాటు చేశారు. రాయల్ సర్కిల్, గాంధీనగర్, సుధా క్రాస్, కౌల్‌బజార్ మొదటి గేటు వద్ద మూడు డివిజన్లకు సంబంధించిన కార్యాలయాలతో పాటు మహానగర పాలికె ప్రధాన కార్యాలయం కూడా ఉంది.
ఖాళీగా 26 ఇంజినీర్ల ఉద్యోగాలు
నగరాభివృద్ధిలో రోడ్లు, డ్రైనేజీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ముఖ్యంగా ఇంజినీర్ల అవసరం ఉంటుంది. నగరంలో జనాభా, విస్తీర్ణంతో పోల్చితే పాలికె కనీసం 55 మంది ఇంజినీర్లను నియమించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 19 మంది ఇంజినీర్లు మాత్రమే ఆయా డివిజన్లలో పని చేస్తున్నారు. మిలిగిన 26 మందికి పైగా ఇంజినీర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఓ వైపు మహానగర పాలికె నుంచి ఎమ్మెల్యే నిధులు, పీడబ్ల్యూడీ శాఖల నుంచి రూ.200 కోట్లకు పైగా అభివృద్ధి పనుల పేరుతో ప్రధాన రహదారులతో పాటు ఆయా వార్డుల్లో రోడ్ల విస్తీర్ణం, డ్రైనేజీ పనులు ప్రారంభించారు. అయితే పనులు నత్తనడకన సాగుతుండటంతో ఆయా రహదారుల్లో వెళ్లేందుకు జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక్కొక్క రోడ్డు పని నెలలు తరబడి పూర్తి చేయకపోవడంతో జనం గమ్యస్థానాలను చేరేందుకు కిలోమీటర్ల కొద్ది తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
మౌలిక సౌకర్యాల కల్పనలో విఫలం
నగరంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో పాలికె ఆదాయం పెరుగుతోంది. అయితే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలువినిపిస్తున్నాయి. మూడు డివిజన్లలో సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. ఏళ్ల తరబడి సిబ్బంది కొరత ఉందంటున్నారే కానీ ..ఆ సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడంలో పాలకులు శ్రద్ధ వహించడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ సిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత తగినంత సిబ్బందిని ఆయా శాఖలకు సంబంధించి అధికారులను నియమించకపోవడంతో నగరాభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని అభిప్రాయం వెల్లడిస్తున్నారు. నగరంలో దాదాపు 170 మందికి పైగా విద్యుత్, రెవెన్యూ, ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉండటంతో ఉన్న సిబ్బందికి పని భారమవుతోందని పలువురు అధికారులు వాపోతున్నారు.
ఓ వైపు సిబ్బంది కొరత
మరో వైపు ఇంజినీర్ల లేమి
ఉన్న సిబ్బందికి పనిభారం
పాలికెగా అప్‌గ్రేడైనా భర్తీ కాని పోస్టులు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
చెత్త సేకరణకూ ఇబ్బందులే
అభివృద్ధి మాట అటు ఉంచితే నగర స్వచ్ఛతను కాపాడే పారిశుధ్య కార్మికులు, ఇంటింటా చెత్తను సేకరించే సిబ్బంది తగినంత మంది లేరు. దీందో నగరంలో చెత్త సేకరణ, పారిశుద్ధ్య సమస్య కూడా రోజు రోజుకు జటిలమవుతోంది. పారిశుధ్య కార్మికులు తగినంత మంది లేకపోవడంతో ఉన్న సిబ్బంది నగర స్వచ్ఛత చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో ఆయా వార్డుల్లో డ్రైనేజీ పరిస్థితి అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. రోడ్లలో చెత్త చెదారం ఎక్కడపడితే అక్కడ వేస్తున్న దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇది స్టీల్ సిటీనా, మహానగర పాలికేనా లేక మున్సిపాల్టీనా, పురసభ అనే అనుమానం కలుగుతోందని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నగరంలో మహానగర పాలికె పరిధిలోని సిబ్బంది కొరతను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.