ప్రమాదంలో అక్కాతమ్ముడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో అక్కాతమ్ముడు దుర్మరణం

Oct 6 2025 2:48 AM | Updated on Oct 6 2025 2:48 AM

ప్రమాదంలో  అక్కాతమ్ముడు దుర్మరణం

ప్రమాదంలో అక్కాతమ్ముడు దుర్మరణం

రాయచూరు రూరల్‌: రహదారి ప్రమాదంలో అక్కా తమ్ముడు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం మాన్వి తాలుకా పోత్నాళ్‌ వద్ద కారు–ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. రోడ్డు ప్రమాదంలో కరేగుడ్డకు చెందిన మరియమ్మ (28), శేఖరప్ప (25) మృతి చెందినట్లు మాన్వి పోలీసులు గుర్తించారు. వల్కం దిన్ని నుంచి కరేగుడ్డకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. దేశాయి క్యాంప్‌కు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియమ్మ, శేఖరప్ప అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిందనూరు డీఎస్పీ తెలిపారు.

ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ

హొసపేటె: విజయనగర జిల్లా కొట్టురు పట్టణంలోని ఒకే రాత్రి నాలుగు ఇళ్ల తాళాలు పగులగొట్టిన దొంగలు.. రూ.97 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ముదుకనకట్టె ప్రాంతంలోని నాలుగు ఇళ్లకు తాళం వేసి ఉండటంతో దొంగలు వాటిని పగులగొట్టి దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే వీటిలో మూడు ఇళ్లు ఖాళీగా ఉండటంతో ఏమీ కనిపించలేదు. అయితే వారు జి.విరుపాక్షప్ప ఇంట్లో బంగారం నెక్లెస్‌, చెవిపోగులు, ఉంగరం, 2 వెండి ప్లేట్లు, 2 వెండి గ్లాసులను దొంగలించారు. సమాచారం అందుకున్న డీవైఎస్పీ మల్లేష్‌ దొడ్డమణి, దురుగప్ప, పీఎస్‌ఐ గీతాంజలి షిండే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి డాగ్‌ స్క్వాడ్‌, వేలిముద్ర నిపుణులు వచ్చారు. రద్దీగా ఉండే సందులో దొంగతనం జరగడం ఆశ్చర్యకరం. ఈ కేసులో దొంగలను గుర్తించడానికి పట్టణంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే, ప్రజలు పోలీస్‌ స్టేషన్‌, 112 లేదా పోలీస్‌ హెల్ప్‌లైన్‌ 18005700కు కాల్‌ చేసి సమాచారం అందించాలని డీవైఎస్పీ మల్లేష్‌ దొడ్డమణి కోరారు.

ఆకట్టుకున్న పథ సంచలనం

హుబ్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలు అలాగే విజయదశమి సందర్భంగా నగరంలో కరసేవకులు కదం తొక్కారు. నెహ్రూ మైదానంలో నిర్వహించిన పథ సంచలనం అందరినీ ఆకట్టుకుంది. తొలుత ఒకటవ పథ సంచలనం కృష్ణభవన, సర్‌ సిద్దప్ప కంబలి మార్గం, సంగొళ్లి రాయన్న సర్కిల్‌, తొలిజా భవన్‌ సర్కిల్‌, శంకరమఠం, హిరేపేట, బెళగవి గల్లి, అలాగే 2వ మార్గం నెహ్రు మైదానం నుంచి ప్రారంభమైంది. జేసీ నగర్‌, శక్తి రోడ్డు, స్టేషన్‌ రోడ్డు, గణేష్‌ పేట సర్కిల్‌, సీబీటీ, మకాన్‌దారి గల్లి, మంగళవార పేట, రాధకృష్ణగల్లి మీదుగా కొనసాగింది. అనంతరం ఈ రెండు పథ సంచలన దుర్గదబైలు సర్కిల్‌లో కలిశాయి. బ్రాడ్‌వే, శివాజీ సర్కిల్‌, కొప్పికర్‌ రోడ్డు, కృష్ణ భవన మార్గం మీదుగా తిరిగి నెహ్రూ మైదానం చేరుకున్నాయి. అనంతరం జరిగిన వేదిక కార్యక్రమంలో దేశ భక్తి పరిడవిల్లెలా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు తన ప్రసంగంలో మాట్లాడారు. పథ సంచలనం జరిగిన చోట్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు

హుబ్లీ: రెండు ఏళ్లలో నవళగుంద అసెంబ్లీ నియోజక వర్గానికి కురుబ సమాజం కనక భవనం అలాగే ఇతర అభివృద్ధి నిర్మాణ పనులకు సుమారు రూ.4 కోట్ల నిధులు విడుదల చేశానని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్‌హెచ్‌ కోనరెడ్డి తెలిపారు. ఆదివారం అణ్ణిగేరిలోని ఉడేదబైల వీధిలోని బీమలింగేశ్వర, నందీశ్వర భజన సంఘం ఆధ్వరంలోని లక్ష్మీదేవి విగ్రహం, నందీశ్వర అలాగే పొట్టేళ్ల మూర్తుల ప్రతిష్టాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అణ్ణిగేరి దాసోహమఠం డాక్టర్‌.శివకుమార్‌ స్వామి, ప్రమఖులు శివానంద, యల్లప్ప, షణ్ముఖ, విరుపాక్షప్పతో పాటు గ్యారెంటీ తాలూకా సమితి అధ్యక్షుడు మంజునాథ తదితరులు పాల్గొన్నారు.

చెరుకు పంట దగ్ధం

హొసపేటె: కంప్లి తాలూకా సమీపంలోని బుక్కసాగర్‌ శివారులో విద్యుత్‌ షాక్‌తో చెరుకు పంట పూర్తిగా కాలిపోయింది. కిన్నూరేశ్వర ఆలయం సమీపంలోని సర్వే నంబర్‌ 118, 119లో సుమారు 4 ఎకరాల 110 సెంట్ల భూమిలో చెరుకు సాగు చేశారు. పంట కోతకు రాబోతున్న తరుణంలో పొలంలో ఉన్న విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో చెరుకు తోట పూర్తిగా కాలిపోయింది. ఎకరా చెరుకు సాగుకు రైతులు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. నష్టానికి పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ఆర్‌ఐ మహమ్మద్‌ షరీఫ్‌, వీఏ మౌనేషా, జేఈసీఓఎం జేఈ కృష్ణమూర్తి సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. చెరకు పంట నష్టంపై నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

సమాజ అసమానతలు పోవాలి

కోలారు: అంతర్జాతి (కులాంతర) వివాహాలతోనే సమాజంలో అంటరానితనం నివారణ అవుతుందని జిల్లా కలెక్టర్‌ ఎంఆర్‌ రవి తెలిపారు. సమాజంలో అసమానతలు కూడా తొలగిపోతాయన్నారు. ఆదివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో సహభోజనం నిర్వహించగా ఆయన పాల్గొన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం గాంధీజీని స్మరించుకుంటే సరిపోదు, ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు.ప్రయత్నంతో మాత్ర మే మార్పులు సాధ్యమవుతాయన్నారు. అన్ని సంఘ సంస్థలు ఈ ప్రయత్నానికి చేతులు కలపాలన్నారు. జిల్లా ఎస్పీ బి.నిఖిల్‌ మాట్లాడుతూ సమాజ ఉద్ధారణ కార్యక్రమాలను సమాజంలోని ప్రతి గ్రామాలకు మూలలకు తీసుకుని వెళ్లాలన్నారు. అన్నదాన దాత చంద్రశేఖర్‌ను సన్మానించారు. కులాలను పాటించం అంటూ అందరూ ప్రతిజ్ఞ చేశారు. కసాప అధ్యక్షుడు గోపాలగౌడ, టి విజయకుమార్‌, పండిత్‌ మునివెంకటప్ప, ఏడీ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement