
భక్తిశ్రద్ధలతో రథోత్సవం
రాయచూరు రూరల్: సమాజంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ప్రతీక దేవీ నవరాత్రులు అని కరేగుడ్డ మహంతేశ్వర మఠం పీఠాధిపతి మహంతలింగ శివాచార్య స్వామీజీ అన్నారు. శనివారం మహంతేఽశ్వర మఠంలో దసరా ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆధునిక భారతదేశంలో మహిళలపై జరుగుతున్న దురాచారాలను నియంత్రించాలన్నారు. దసరా ధర్మ సమ్మేళనం జాగృతి కార్యక్రమాలు చేపట్టమన్నారు. అనంతరం మహిళలతో కలసి రథాన్ని లాగారు. కార్యక్రమంలో సంగన బసవ, మాజీ శాసన సభ్యుడు బసన గౌడ, బసలింగప్ప, శేఖరయ్య, అణ్ణప్ప గౌడ, చంద్రయ్య, చెన్నయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి అరెస్ట్
హుబ్లీ: నగరంలోని ఓ కాలనీలో బాలికలు ఆరవేసిన లోదుస్తులను ఎత్తుకెళ్తున్న వ్యక్తిని బెండిగేరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుస్తులను ఇతడు రహస్యంగా చోరీ వేసేవాడని విచారణలో ఒప్పుకున్నాడు. సీసీ కెమెరాల చోరీ కేసులు కూడా నిందితుడిపై ఉన్నాయని పోలీసులు వివరించారు.
గ్రామాల అభివృద్ధికి సహకారం అవసరం
రాయచూరు రూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని గ్రామీణ శాసన సభ్యుడు బసవన గౌడ పేర్కొన్నారు. శనివారం లింగన్ ఖాన్ దొడ్డి, హిరాపూర, ఏలెబిచ్చాలి, అరోలి, అడవిఖాన పూర్, ఉడుమగల్‌లో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు పాటుపడతామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దేహదానానికి అంగీకారం
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లా గంగావతి తాలుకా శ్రీరామ నగర్‌కు చెందిన గారపాటి రామకృష్ణ తన దేహదానానికి అంగీకరించారు. దేహాన్ని కొప్పళ ప్రభుత్వ వైద్యకీయ కళాశాల పరిశోధన సంస్థకు, కళ్లను హుబ్లీ ఎంఎం జోషి నేత్రాలయానికి ఇవ్వడానికి వీలునామా రాసి ఇచ్చారు. ప్రవాసాంధ్రుడు, కన్నడ సాహితి ప్రియుడు, స్వామి వివేకానంద సేవా సంఘం అధ్యక్షుడు అయిన గారపాటి రామకృష్ణ తెలుగు, కన్నడ భాషల్లో రచనలు చేశారు.
ఔషధాల పేరుతో
రూ.1.44 లక్షల టోకరా
హుబ్లీ: కాళ్ల నొప్పులకు ఔషధాలు ఇచ్చి బాగు చేస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1.44 లక్షలు తీసుకుని మోసగించారు. గురుగొల్ల, శీను, చంద్రగోకాక, కుమార, వినోద తళవార అనే వ్యక్తులు మాంగిలాల్‌కు ఔషధాన్ని ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. అయితే ఆ ఔషధం వల్ల కాలి నొప్పి తగ్గలేదు. నిందితులు అంగడి వాకిలి వేసి పరారీ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నించినట్లు బాధితుడు కేశ్వపుర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆభరణాల చోరీ..
ఇంటి తాళాలు పగలగొట్టి ఆభరణాలు, రూ.4 లక్షల నగదు చోరీ చేసిన ఘటన గోకుల్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సదరు స్టేషన్ పరిధిలో మారుతీ నగర నజీమ్ మునిస్సా ఇంట్లోని బీరువాలో ఉంచిన రూ.50 వేల విలువ చేసే 10 గ్రాముల బంగారు ఆభరణాలు, అలాగే రూ.4 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. గోకుల్ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నేత్రపర్వం.. దీపోత్సవం
కోలారు: కోలారు తాలూకా వక్కలేరి గ్రామంలో అంబేడ్కర్ నగర్ ఆధ్వర్యంలో సామ్రాట్ అశోక విజయదశమి కార్యక్రమాలను ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి గణపతి పూజ, గ్రామ దేవతల దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పూలతో అలంకరించిన దీపాలను తలపై మోసుకుని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి గ్రామ దేవతలకు సమర్పించారు. భక్తులు గ్రామదేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో రథోత్సవం

భక్తిశ్రద్ధలతో రథోత్సవం