
రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టండి
హొసపేటె: నగరంలో ప్రముఖ రహదారులతో పాటు వివిధ వార్డుల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలకు దారి తీశాయని, వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి బాగుపరచాలని నగరసభ సభ్యులు ముక్త కంఠంతో నగర ప్రజాపనుల శాఖ అధికారి రవినాయక్‌పై మండిపడ్డారు. మంగళవారం నగరంలోని నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నగరసభ సామాన్య సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే నగరంలో అనేక రోడ్లు దెబ్బ తిన్నాయని, దీని వల్ల వాహనదారులు, పాదచారులు వార్డు సభ్యులను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. వెంటనే మరమ్మతులను చేపట్టాలన్నారు. ప్రజాపనుల శాఖ అధికారి రవినాయక్ బదులిస్తూ ఇప్పటికే కొన్ని చోట్ల రోడ్ల మరమ్మతులను ప్రారంభించామన్నారు. నిధులు మంజూరు అయిన వెంటనే మిగతా చోట్ల మరమ్మతులు చేపడతామన్నారు. ఈ విషయంపై మరికొంత సభ్యులు మాట్లాడుతూ ప్రజాపనుల శాఖ అధికారులు రోడ్డు మరమ్మతులు ప్రారంభించే ముందు ఆయా వార్డు సభ్యులకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న నగరసభకు ఆమోదం తెలిపారు. అదే విధంగా నగరంలో వివిధ వార్డుల్లో నిర్మాణంలో సగానికి నిలిచి పోయిన సముదాయ భవనాలను వెంటనే పూర్తి చేయాలని కోరారు. అనంతరం సమావేశంలో వివిధ విషయాలకు సంబంధించిన వాటికి సభ్యులు ఆమోదం తెలిపారు. నగరసభ అధ్యక్షులు రూపేష్‌కుమార్, ఉపాధ్యక్షులు రమేష్ గుప్తా, స్థాయి సమితి అధ్యక్షులు కిరణ్, కమిషనర్ ఎర్రగుడి శివకుమార్, వివిధ వార్డుల సభ్యులు, నగరసభ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నగరసభ సమావేశంలో
ముక్త కంఠంతో సభ్యుల ఒత్తిడి