రాయచూరు రూరల్: యాదగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి జరిగిన కేడీపీ సమావేశంలో గురుమఠకల్ ఎమ్మెల్యే శరణేగౌడ కందకూరు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎరువులు, క్రిమి సంహారక మందుల కొరత రాకుండా వ్యవసాయ శాఖాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకు 2 లక్షల మెట్రిిక్ టన్నుల ఎరువులున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం కావడంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. పీడీఓలు గ్రామాల్లో పర్యటించి సమస్యలపై స్పందించాలని సూచించారు. సమావేశం ఉన్నట్లు సరైన సమాచారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం చేసిన అంశంపై జిల్లాధికారి హర్షల్ బోయర్‌తో సుదీర్ఘంగా మాట్లాడారు. సమావేశంలో శాసన సభ్యులు చెన్నారెడ్డి పాటిల్ తన్నూరు, రాజా వేణుగోపాల్ నాయక్, అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే, కలెక్టర్ మధ్య వాగ్వాదం