
గణపతి బప్పా మోరియా
ఊరేగింపులో పాల్గొన్న వేలాది మంది జనం
చిత్రదుర్గలో వినాయక నిమజ్జన ఊరేగింపు
సాక్షి,బళ్లారి: కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారత దేశంలోనే చిత్రదుర్గ హిందూ మహాగణపతికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ప్రతి ఏటా వినాయక చవితి రోజున ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి 18 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది వినాయక చవితి రోజున చిత్రదుర్గలో ఏర్పాటు చేసిన హిందూ మహాగణపతిని శనివారం ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. చిత్రదుర్గంలోని స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన హిందూ మహాగణపతిని 18 రోజుల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన గణేష్ భక్తుల సమక్షంలో వినాయక విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగించారు. కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారత దేశంలోనే వినాయకులు నిమజ్జనానికి ఇంత పెద్ద స్థాయిలో జనం ఎక్కడా వచ్చి ఉండరని పోలీసు యంత్రాంగం సైతం చెబుతుండటం విశేషం.
వేలాది మంది పోలీసులతో బందోబస్తు
వినాయక నిమజ్జనానికి లక్షలాది మంది పాల్గొనడంతో దాదాపు 5 వేల మందికి పైగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. నలుగురు ఎస్పీలు, 28 మంది డీఎస్పీలు, వందలాది మంది సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితరులు పాల్గొనడంతో చిత్రదుర్గం మొత్తం పోలీసు వలయంలో చిక్కుకుంది. మధ్యాహ్నం ప్రారంభమైన వినాయక ఉరేగింపు నగరంలోని స్టేడియం రోడ్డు ప్రధాన రహదారి గుండా చంద్రవళ్లి చెరువు వరకు లక్షలాది మంది జనం ముందు, వెనుక సాగుతూ జనసంద్రంగా మారిపోయింది. ఊరేగింపులో నాసిక్ డోలు, కేరళ బెండే, మహాపురుషుల వేషాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రమ్ములు, సౌండ్ తక్కువగా పెడుతూ డీజే తరహాలో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టం పెట్టుకుని యువత పెద్ద సంఖ్యలో నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్, హిందూ సంఘటన వేదికలు, అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులతో పాటు కులమతాలకతీతంగా జనం పాల్గొనడంతో చిత్రదుర్గ హిందూ మహాగణపతి నిమజ్జన ఊరేగింపు చూసిన వారందరినీ ఆకట్టుకుంది. హిందూ మహాగణపతి ఊరేగింపు, నిమజ్జనం లైవ్‌లో కార్యక్రమాలు ప్రసారం చేయడంతో దూర ప్రాంతాల నుంచి కూడా వీక్షించి తన్మయత్వం చెందారు.
చిత్రదుర్గలో ఘనంగా గణేష్ నిమజ్జనం
లక్షలాది మంది భక్తులు హాజరు
దారిపొడవునా కళాకారుల నృత్యాలు

గణపతి బప్పా మోరియా