
బీపీఎల్ కార్డులు రద్దు చేసే కుట్ర
సాక్షి బళ్లారి: పేదలకు కడుపు నింపుతున్న బియ్యాన్ని కూడా ఇవ్వకుండా రేషన్ కార్డులను సర్వే పేరుతో రద్దు చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి శ్రీరాములు ధ్వజమెత్తారు. ఆయన శనివారం తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 22వ తేదీన రాష్ట్రంలో నిర్వహిస్తున్న వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యా, ఆర్థిక, స్థితిగతులకు సంబంధించి సర్వే చేసి లూటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలకు విద్యాభ్యాసం, ఆర్థిక పరిస్థితులు, కుల సమీక్షకు సర్కార్ ముందడుగు వేస్తోందని, వచ్చే డిసెంబర్‌లోపు నివేదిక ఇవ్వాలని కమిషన్ ప్రముఖులు మధుసూదన్ నాయక్‌కు బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. మధుసూదన్ సీఎంకు అత్యంత ఆప్తులని గుర్తు చేశారు. గత 10 ఏళ్ల నుంచి రూ.150 కోట్లు ఖర్చు చేసి 54 ప్రశ్నలతో కాంతరాజు కమిషన్ సమీక్ష చేసిందని, అది సరిగా లేదని, ప్రస్తుతం 60 ప్రశ్నలతో సెప్టెంబర్ 22 నుంచి రూ.420 కోట్ల వ్యయంతో సమీక్ష చేస్తున్నారన్నారు.
సమీక్ష పేరుతో కులమతాల మధ్య చిచ్చు
ఈ సమీక్షలో 52 వెనుకబడిన కులాలను ముందుగానే అనుమానం వచ్చే విధంగా చేర్చారని సిద్ధరామయ్యకు ఎందుకు అర్థం కాలేదని ప్రశ్నించారు. సమీక్ష పేరుతో కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ఐదు గ్యారెంటీల ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తూ ఆర్థిక పరిస్థితిని అధిగమించామని గొప్పలు చెప్పుకుంటున్న పాలక పెద్దలు సర్వే పేరుతో బీపీఎల్ కార్డులు రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఓ వైపు సర్వే పేరుతో బీపీఎల్ కార్డులు రద్దు చేస్తుండటంతో పాటు పెద్ద ఎత్తున నగదు కూడా లూటీ జరుగుతోందన్నారు. తక్కువ సమయంలో సర్వే చేస్తూ లూటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కుర్చీకి ఎసరు పెట్టినప్పుడల్లా ఇలాంటి ఎత్తుగడ వేస్తున్నారన్నారు. 17వ రాష్ట్ర బడ్జెట్ సిద్ధరామయ్య ప్రవేశపెట్టడం అనుమానంగా ఉందన్నారు. హాసన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పేదల కడుపు కొట్టేందుకు
రాష్ట్ర ప్రభుత్వం కుటిల యత్నం
మాజీ మంత్రి శ్రీరాములు ధ్వజం