
హాసన్‌లో మరణించిన ఇంజినీరింగ్ విద్యార్థి
సాక్షి,బళ్లారి: హాసన్‌లో వినాయక నిమజ్జనంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందగా, వారిలో ఉన్న బళ్లారికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్ కుమార్(21) మృతదేహం శనివారం నగరంలోని నాగలకెరెలోని నివాస గృహానికి తీసుకుని రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉన్నత విద్యాభాస్యం కోసం హాసన్‌కు వెళ్లి చదువుకుంటుండగా, ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సు ముగుస్తున్న తరుణంలో ఉద్యోగం కూడా వస్తుందనే సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అంతలోనే విధి వక్రించింది. ప్రవీణ్ తండ్రి కూడా మరణించిన నేపథ్యంలో తల్లి ఆస్పత్రిలో పని చేస్తూ కుమారుడిని ఉన్నత చదవులు చదివిస్తోంది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లితో పాటు కుటుంబ సభ్యుల రోదనలు ఆపడానికి ఎవరి తరం కాలేదు. మృతదేహాన్ని తీసుకు రాగానే నాగలకెరె వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి అశ్రునయనాలతో ప్రవీణ్‌కుమార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా సమాచారం అందుకున్న మాజీ మంత్రి శ్రీరాములు ప్రవీణ్‌కుమార్ ఇంటికి చేరుకుని మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు.
బళ్లారి నాగలకెరెలోని స్వగృహానికి
చేరిన మృతదేహం
కన్నీరుమున్నీరైన కుటుంబం, బంధువులు