
రాజీ ప్రక్రియతో కేసుల సత్వర పరిష్కారం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో చిన్న, చిన్న తప్పులకు వివాదాలు రావడంతో కేసులు అధికమవుతున్న తరుణంలో రాజీ ప్రక్రియతో కేసులను త్వరగా పరిష్కరించుకోవచ్చని జిల్లా అదనపు న్యాయమూర్తి స్వాతిక్ పేర్కొన్నారు. శుక్రవారం ఏపీఎంసీ సమీపంలోని బసవేశ్వర కాలనీలో జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా ప్రాధికారల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. కక్షిదారులు, ప్రత్యర్థులు ఏకమై రాజీ సంధాన మార్గంలో కేసులను త్వరితగతిన పరిష్కారానికి న్యాయ సేవా ప్రాధికార పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఉచితంగా న్యాయం చేకూర్చడానికి వీలు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పవన్, లక్ష్మికాంతరెడ్డి, అమరేష్‌రెడ్డిలున్నారు.
బర్త్ డే పార్టీకని పిలిచి జల్సా.!
● హాస్టల్ వార్డెన్, వంట మనిషికి నోటీసులు
హుబ్లీ: బర్త్ డే పార్టీ అని హాస్టల్ విద్యార్థులను హోటల్‌కు పిలిపించుకొని విందు, చిందుతో పాటు జల్సా చేసిన కేసుకు సంబంధించి హాస్టల్ వార్డెన్‌తో పాటు వంట మనిషికి కూడా నోటీసులు ఇచ్చిన ఘటన విజయపురలో చోటు చేసుకుంది. సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆ మేరకు వారిద్దరికీ నోటీసులు జారీ చేశారు. విజయపుర రాజ్‌కుమార్ లేఅవుట్‌లోని మెట్రిక్ అనంతర వృత్తి పర బాలికల హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంఘీక సంక్షేమ శాఖ పరిధిలోని ఈ హాస్టల్ వార్డెన్ శకుంతల రాజ్‌పుత్, ఎటువంటి అనుమతి తీసుకోకుండా హాస్టల్ విద్యార్థినులను పుట్టిన రోజు విందుకు అని హోటల్‌కు తీసుకెళ్లారు. ఆ మేరకు హాస్టల్ విద్యార్థినులతో చిందు, మందు వేసి జల్సా చేయడం ద్వారా హాస్టల్ నియమాలను ఉల్లంఘించారు. ఘటన వివరాలను అందుకున్న వెంటనే సదరు శాఖ డీడీ బాధ్యురాలైన హాస్టల్ వార్డెన్ శకుంతల, వంట మనిషి రిజ్వాన్ ముల్లాకు నోటీసులను జారీ చేశారు. వంట మనిషి గతంలో ఇండి తాలూకాలోని హాస్టల్‌లో కూడా ఇదే విధంగా బర్త్‌డే పార్టీ చేసి సస్పెండ్‌కు గురైనట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది.
అగ్నిపథ్ సేనా ర్యాలీకి శ్రీకారం
రాయచూరు రూరల్: అగ్నిపథ్ సేనా ర్యాలీకి నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ శ్రీకారం చుట్టారు. శుక్రవారం వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సేనా నియామక ర్యాలీని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దేశసేవకు యువత ముందుకు రావాలన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులకు బంజార సేవా సంఘం భవన్, వాల్మీకి భవన్, సంతోష్ హబ్, కేఈబీ కళాశాలల్లో మౌలిక సౌకర్యాలను కల్పించడం అభినందనీయమన్నారు. ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు నగరంలోని సంఘ సంస్థలు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు. సేనా ర్యాలీలో సుమారు 20 వేల మంది యువత పాల్గొన్నారన్నారు. నగరసభ ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ సమీర్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, కృష్ణ, తహసీల్దార్ సురేష్ వర్మ, చంద్రశేఖర్, మల్లనగౌడ, పురుషోత్తంలున్నారు.
రోడ్డు ప్రమాదంలో భిక్షకుడి మృతి
హుబ్లీ: హుబ్లీ తాలూకా అంచటగేరి వద్ద జాతీయ రహదారి–63 పక్కన నిలబడిన భిక్షకుడిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సదరు వ్యక్తి మృతి చెందారు. అతివేగంతో వచ్చిన వాహనం భిక్షకుడిని ఢీకొంది. వాహనంతో పాటు డ్రైవర్ పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన భిక్షకుడిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదని పోలీసులు తెలిపారు. హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి అదృశ్యం
ఇంటి నుంచి చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ వ్యక్తి నెలన్నర రోజులైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జిల్లాలోని కుందగోళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కుందగోళ తాలూకా కమడొళ్లికి చెందిన చంద్రశేఖర్(35) కనిపించకుండా పోయిన వ్యక్తి. 5.6 అడుగుల ఎత్తు, గోధుమ రంగు శరీరఛాయ కలిగిన ఈయన గత జూన్ 22 నుంచి కనిపించడం లేదని, ఇతని ఆచూకీ తెలియజేయాలని బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిధుల మళ్లింపుపై నిరసన
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బోవి సమాజం అభివృద్ధి మండలి నిధులను సమాజాభివృద్ధికి వ్యయం చేయకుండా పంచ గ్యారెంటీలకు మళ్లించడం తగదని బోవి సమాజం నేతలు పేర్కొన్నారు. శుక్రవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో లింగసూగూరు శాసన సభ్యుడు వజ్జల్ మానప్ప మాట్లాడారు. 2025–26లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన రూ.13,43,384ల నిధులను పంచ గ్యారెంటీలకు వినియోగించారన్నారు. బోవి సమాజానికి కేటాయించిన స్వావలంబి సారథి, గంగా కళ్యాణ, స్వయం ఉపాధి, ఉద్యమ శీలత, భూ పథకం, బోర్‌వెల్, కుట్టు మిషన్లు వంటి వాటికి సబ్సిడీలు లేకుండా చేశారని ఆరోపించారు. బోవి సమాజం నిధులు మండలికి కేటాయించాలని కోరుతూ జిల్లాధికారి ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, వీరనగౌడ, నారాయణ స్వామి, బీవీ నాయక్, రవీంద్ర జాలదార్, గంగాధర నాయక్, బసనగౌడ, కొట్రేశ్‌లున్నారు.

రాజీ ప్రక్రియతో కేసుల సత్వర పరిష్కారం