వరమహాలక్ష్మీ నమోస్తుతే | - | Sakshi
Sakshi News home page

వరమహాలక్ష్మీ నమోస్తుతే

Aug 9 2025 7:40 AM | Updated on Aug 9 2025 7:40 AM

వరమహా

వరమహాలక్ష్మీ నమోస్తుతే

సాక్షి, బళ్లారి: ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే వరమహాలక్ష్మి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం వరమహాలక్ష్మి పండుగ పౌర్ణమి రోజున రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వరమహాలక్ష్మి అమ్మవారిని ఇంటింటా అలంకరణ చేసుకుని, వివిధ రకాల నైవేద్యాలను సమర్పించుకుని, ఎవరికి వారు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పండుగను చేసుకున్నారు. వరమహాలక్ష్మీ వ్రత మంత్రాలను జపిస్తూ అమ్మవారిని కొలిచారు. మహిళలు ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ అమ్మవారిని తమ ఇళ్లలో అలంకరించుకుని పూజలు చేయడంతో నగరంలో వరమహాలక్ష్మి పండుగ కళ ఉట్టిపడింది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిని వరమహాలక్ష్మిద పండుగ రోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తే ధనప్రాప్తి పొందడమే కాకుండా ప్రతి రంగంలోను విజయం సొంతమవుతుందని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం, నమ్మకం ఉండటంతో వరమహాలక్ష్మిద పండుగను వేడుకగా జరిపారు. నగర ఆదిదేవత శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు చేసి, అలంకరణలు చేయడంతో ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం అందులోనూ వరమహాలక్ష్మిద పండుగ రోజున శ్రీకనక దుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో క్యూకట్టి అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు.

విజయనగరలో..

హొసపేటె: ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నగరంలో వరమహాలక్ష్మి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇంట్లో సాంప్రదాయబద్ధంగా అలంకరణలు, పూలదండలు, రంగురంగుల రంగోలీలతో పండుగ వాతావరణం నెలకొంది. మహాలక్ష్మి దేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజించారు. మంత్రాలు పఠించారు. హారతి ఇచ్చారు. పండుగలో భాగంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి పూజల్లో పాల్గొన్నారు. ఇరుగు పొరుగువారు, బంధువులు, స్నేహితులు హాజరై దేవి కృప కోసం ప్రార్థించారు. పూజ తర్వాత మహా ప్రసాదం పంపిణీ చేశారు. భక్తి సంప్రదాయం, సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ పండుగ ఇంటికి ఆనందాన్ని వేడుకను తెచ్చి పెట్టింది.

మార్కెట్‌లో పండుగ సందడి

విజయనగర జిల్లా అంతటా వరమహాలక్ష్మి పండుగ వేడుకగా జరిగింది. పండుగ షాపింగ్‌ జోరుగా సాగింది. జిల్లా ప్రధాన కార్యాలయం, హొసపేటె, హగరిబొమ్మనహళ్లి, హువిన హడగలి, కూడ్లిగి, హరపనహళ్లి తాలూకాల్లో వర మహాలక్ష్మి పండుగకు సన్నాహాలు మిన్నంటాయి. పూలు, పండ్లు, అరటి పిలకలు, చెరుకు వంటి పూజా సామగ్రిని కొనుగోలు చేయడంలో ప్రజలు బిజీగా గడిపారు. మహిళలు ఇళ్లలో వరమహాలక్ష్మి దేవిని ప్రతిష్టించి, చీరలు, రవికలు, దుస్తులు, ఆకుపచ్చ రంగు గాజులు, పసుపు, కుంకుమ, దేవత ముఖ కిరీటం, దేవతకు అలంకార వస్తువులను కొనుగోలు చేశారు. నగరంలోని మూరంగడి సర్కిల్‌, గాంధీ చౌక్‌, మదకరి నాయక సర్కిల్‌, కూరగాయల మార్కెట్‌ వద్ద పూలు, పండ్ల వ్యాపారం జోరుగా జరిగింది. మార్కెట్‌తో పాటు ఇతర ప్రదేశాల్లో పూలు, పండ్లు, అరటిపండ్లు, చెరుకు గడలు అమ్ముడు పోయాయి. వాటిని కొనడానికి వచ్చిన ప్రజలతో నగరంలోని ప్రధాన రహదారులు నిండిపోయాయి. ట్రాఫిక్‌ సమస్యను నివారించడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారు. నగరంలోని గాంధీచౌక్‌లో పూలు, పండ్ల వ్యాపారం జోరుగా జరిగింది.

భక్తిశ్రద్ధలతో వరమహాలక్ష్మి

పండుగ ఆచరణ

ఇంటింటా అమ్మవారికి

అలంకరణలు, పూజలు

కనక దుర్గమ్మ ఆలయంలో

కిటకిటలాడిన భక్తులు

వరమహాలక్ష్మీ నమోస్తుతే1
1/5

వరమహాలక్ష్మీ నమోస్తుతే

వరమహాలక్ష్మీ నమోస్తుతే2
2/5

వరమహాలక్ష్మీ నమోస్తుతే

వరమహాలక్ష్మీ నమోస్తుతే3
3/5

వరమహాలక్ష్మీ నమోస్తుతే

వరమహాలక్ష్మీ నమోస్తుతే4
4/5

వరమహాలక్ష్మీ నమోస్తుతే

వరమహాలక్ష్మీ నమోస్తుతే5
5/5

వరమహాలక్ష్మీ నమోస్తుతే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement