
హస్తం.. నిరసన గళం
శివాజీనగర: ఓట్లను దొంగిలించారంటూ ఎన్నికల కమిషన్‌కు, కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో శుక్రవారం భారీ ఎత్తున నిరసనను నిర్వహించింది. ఫ్రీడం పార్కులో ధర్నా, బహిరంగ సభ సాగింది. రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్, సీనియర్ నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభా నియోజకవర్గంలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలోనే 1 లక్ష ఓట్లను అక్రమంగా చేర్చారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాహుల్ సహా ముఖ్యనేతలు మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై ఆరోపణలు సంధించారు.
దొంగ సర్కారు: ఖర్గే
2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓట్లు దొంగిలించి ఈ దేశ ప్రధాని అయ్యారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తూ గత ఎన్నికలు ప్రజలకు ద్రోహం చేసిన ఎన్నికలు. మోదీ, అమిత్ షాకు ప్రజలు ఓటు వేయకపోయినా కూడా ఓట్లు చోరీ చేసి గెలిచామంటున్నారు. ఇందుకు ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటున్నారు. ఇది దొంగ ప్రభుత్వం. వీరికి నైతిక బలం లేదు. ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదు అని దుయ్యబట్టారు. 2019లో తాను తొలిసారిగా ఓడినప్పుడే బోగస్ ఓటింగ్ అని అనుమానం వచ్చిందన్నారు.
మోదీకి హక్కు లేదు: సీఎం సిద్దు
లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల దొంగతనం చేసిన నరేంద్ర మోదీకి ప్రధాని కుర్చీలో కూర్చునే నైతిక హక్కు లేదని, తక్షణమే రాజీనామా చేయాలని సీఎం సిద్దరామయ్య అన్నారు. సభలో ఆయన ప్రసంగిస్తూ ఎన్నికల కమిషన్ బీజేపీ ఆఫీసుగా మారిందన్నారు. మనువాదులు, రాజ్యాంగ వ్యతిరేకులు రాజ్యాంగ వ్యవస్థనే తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లను గెలవాల్సి ఉంది, అయితే ఓట్ల దొంగిలింపుతో అనేకచోట్ల ఓడిపోయామని ఆరోపించారు. ఈవీఎంలు వచ్చిన తరువాత దుర్వినియోగం జరుగుతోందన్నారు.
స్వతంత్ర పార్కులో బృహత్ ఆందోళన
ఈసీ, ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ, ఖర్గే ఆరోపణలు

హస్తం.. నిరసన గళం

హస్తం.. నిరసన గళం