
మూర్ఖపు మాటలవి: విజయేంద్ర
శివాజీనగర: రాహుల్‌గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయి ఓట్ల దొంగతనం అని మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాహుల్ మాటలతో ఓటర్లను అవమానించారు. కొందరు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన సమాచారాన్ని రాహుల్‌గాంధీ సాక్ష్యాలు అనుకొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మూర్ఖుల మాదిరిగా ప్రధాని రాజీనామాను కోరుతున్నారు అని విమర్శించారు.
చెట్లేం పాపం చేశాయ్?
● వక్క తోట నరికివేత
పావగడ: విద్వేషాలకు పచ్చని చెట్లు బలయ్యాయి. తాలూకాలోని విష సంస్కృతి వ్యాపిస్తోంది. చిత్తగానహళ్ళి గ్రామ రైతు సీఆర్ రంగణ్ణ కు చెందిన సుమారు 120 వక్క చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికి వేసిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. 4 సంవత్సరాల నుంచి పెంచిన వక్క చెట్లను నరికివేయడం తో రైతు రంగణ్ణ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అప్పులు చేసి తోటను సాగు చేశానని, పంట పండే సమయంలో దుండగులు నరికివేశారని వాపోయాడు. ఈ సంఘటనపై గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. గ్రామంలో ఎవరికీ హాని తలపెట్టని రంగణ్ణకు తీవ్ర నష్టం చేకూర్చారని మండిపడ్డారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు విలపించాడు. ఇలాంటి దారుణాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలన్నారు. స్థానికులతో కలిసి సీఐ సురేశ్‌కు ఫిర్యాదు చేశారు.