మైసూరు టు తిరుపతికి రైళ్లను పెంచాలి | - | Sakshi
Sakshi News home page

మైసూరు టు తిరుపతికి రైళ్లను పెంచాలి

Aug 9 2025 7:40 AM | Updated on Aug 9 2025 7:40 AM

మైసూరు టు తిరుపతికి రైళ్లను పెంచాలి

మైసూరు టు తిరుపతికి రైళ్లను పెంచాలి

మైసూరు: ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి, తిరుమలకు మైసూరు, మండ్య, చామరాజనగర జిల్లాల నుంచి అతి ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారు, వారి కోసం తిరుపతికి అదనపు రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మైసూరు ఎంపీ యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయార్‌ కోరారు. శుక్రవారం ఢిల్లీలో ఆయనను కలిసి తిరుపతి–బెంగళూరు మధ్య వందేభారత్‌ రైలు ఉందని, దానిని మైసూరు సిటీ వరకు విస్తరించాలని కోరారు. అలాగే మైసూరు చుట్టుపక్కల జిల్లాలవారి కోసం తిరుపతికి అదనంగా రైళ్లను నడపాలని డిమాండ్‌ చేశారు.

అన్నదాత బలవన్మరణం

మైసూరు: అప్పులబాధను తట్టుకోలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని దాసనపుర గ్రామంలో జరిగింది. రైతు వెంకటేష్‌ (45), వ్యవసాయ సేవా సహకార బ్యాంకులో రూ. 5 లక్షలకు పైగా అప్పులు చేశాడు. అలాగే కొటక్‌ మహేంద్ర బ్యాంకులో రూ.10 లక్షలు తీసుకుని ట్రాక్టర్‌ను కొన్నాడు, కుటుంబం, ఇతరత్రా ఖర్చుల కోసం కూడా రుణాలు తీసుకున్నాడు. పొలంలో పంట పండినా సరైన ధర లేక నష్టపోయాడు. రూ. 20 లక్షల అప్పులను తీర్చే మార్గం లేక తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హుణసూరు గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

విష్ణువర్ధన్‌ సమాధి

ధ్వంసం

యశవంతపుర: ప్రముఖ కన్నడ దివంగత నటుడు, సాహససింహ విష్ణువర్ధన్‌ సమాధిని ఎవరో దుండగులు ధ్వంసం చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. అభిమాన్‌ స్టూడియోలో ఆయన సమాధి ఉంది. గురువారం సాయంత్రం వరకు సమాధి బాగానే ఉండగా శుక్రవారం ఉదయానికి మాయమైంది. అక్కడి స్థలం గురించి బాలణ్ణ కుటుంబం, విష్ణువర్ధన్‌ అభిమానుల మధ్య కొన్ని రోజుల నుంచి వివాదం నడుస్తోంది. ఇటీవల విష్ణు పుణ్యతిథి నిర్వహించడానికి కూడా బాలణ్ణ కుటుంబం అవకాశమివ్వలేదు. వారే ఈ సమాధిని ధ్వంసం చేశారని అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

ధర్మస్థల గొడవల్లో

ఒకరి అరెస్టు

బనశంకరి: ధర్మస్థలలో యూట్యూబ్‌ చానెళ్ల విలేకరులు, మీడియా సిబ్బందిపై దాడులు చేసిన కేసుల్లో స్థానికుడు సోమనాథ సపల్య (50) అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ పీ.అరుణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం మంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ... బెళ్తంగడి నివాసి చరణ్‌శెట్టి అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు గిరీశ్‌ మట్టణ్ణవర్‌, మహేశ్‌ తిమరోడి పై కేసు నమోదైందని తెలిపారు. వీరు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా భయం పుట్టించేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని చెప్పారు. పునీత్‌కెరెహళ్లి పై బెళ్తంగడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అతడు కూడా ఫేస్బుక్‌లో అశ్లీలంగా మాట్లాడినట్లు తేలిందన్నారు.

శరీర భాగాల కోసం గాలింపు

అపరిచిత మహిళ హత్య కేసు...

తుమకూరు: తుమకూరు జిల్లాలో మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా ఖండించి దూరదూరంగా విసిరేసిన కేసులో సస్పెన్స్‌ వీడుతోంది. కొరటిగెరె తాలూకాలో కోలాల సమీపంలో దొడ్డసాగరె గ్రామపంచాయతీ పరిధిలో చింపుగానహళ్ళి ముత్యాలమ్మ గుడి వద్ద గురువారం మహిళ చేతులు, జుట్టు, కొంత దూరంలో కాళ్లు లభించాయి. దొగ్గెనహళ్ళి వద్ద తల పడి ఉంది. మరెనాయకనహళ్ళి దగ్గర వెనుక భాగం ఉంది. మహిళ ఎద భాగంతో పాటు లో దుస్తులు కూడా అక్కడ దొరికాయని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 60 శాతం అవయవాలు లభించాయని, 40 శాతం దొరకాలని చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాలలో పోలీసులు పగలూ రాత్రి వెతుకుతున్నారు. చింపుగానహళ్ళి దగ్గర రెండు రోజుల కింద ఓ కారు తిరిగినట్లు కొన్ని సీసీ కెమెరాలలో రికార్డయింది. ఆ క్లూ తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ మిస్సింగ్‌ కేసులు ఆరా తీస్తున్నారు. కేసు కొలిక్కి వచ్చినట్లు, మృతురాలు మధ్యవయస్కురాలని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement