
స్వామీజీకి విషప్రాసన అనుమానం?
హుబ్లీ: కూడల సంగమ బసవ జయ మృత్యుంజయ స్వామిని అంతం చేస్తే పంచమశాలి సమాజం 2ఏ రిజర్వేషన్ల డిమాండ్ పోరాటానికి మంగళం పలకవచ్చని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. ఇందుకు బలం చేకూర్చేలా కొన్ని ఘటనలు జరగడం పలు అనుమానాలకు దారి తీస్తోందని విధానసభ విపక్ష నేత అరవింద బెల్లద ఆరోపించారు. స్వామి విషపూరిత ఆహార సేవనంతో అస్వస్తులుగా ఆస్పత్రిలో చేరారు. ఆయనకు పెట్టిన అన్నంలో విషం కలిపినట్లుగా స్వామీజీ అనుమానం వ్యక్తం చేశారు. ఇది నిజమే అయితే ఇది భారీ దుష్కృత్యం అని బెల్లద మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కొన్ని రోజుల క్రితం కూడల సంగమ లింగాయత పంచమసాలి మఠానికి తాళం వేశారు. భక్తులు అసంతృప్తి, డిమాండ్‌కు అనుగుణంగా స్వామి మఠానికి తిరిగి వచ్చారు. అనంతరం అక్కడ జరిగే పరిణామాలను గమనించడానికి కొందరు యువకులను ఏర్పాటు చేశారు. వారు వంటింటిలోకి వెళ్లిన రోజే స్వామీజీ ఆరోగ్యంలో సమస్య ఏర్పడింది. స్వామీజీ ఏ ఒక్క పార్టీకి పరిమితం కాదు. స్వామీజీ సమాజ అభ్యుదయానికి రాత్రింబగళ్లు పోరాడుతున్నారన్నారు. ఈ అన్ని పరిణామాలను సూక్ష్మంగా గమనిస్తున్న సమాజం తగిన సమయంలో తగిన విధంగా సమాధానం చెబుతుందన్నారు.
ప్రత్యామ్నాయ శాఖా మఠం నిర్మాణం:
కూడల సంగమ పంచమసాలి పీఠం జయ మృత్యుంజయ స్వామి అభద్రతాభావం కనిపిస్తే కూడల సంగమ పీఠం మూల స్థానంలోనే మరో ప్రత్యామ్నాయ శాఖా మఠం ఆయన కోసం నిర్మిస్తామని మాజీ మంత్రి సీసీ పాటిల్ తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ స్వామీజీ, అలాగే పంచమశాలి ట్రస్ట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర మధ్య విభేదాలు పరిష్కరించుకోవాలి. దీన్ని ఎవరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోరాదు. మఠానికి తాళం వేయడం వల్ల ఏమీ రాదు. అనివార్యం అయితే ప్రత్యామ్నాయ శాఖా మఠం ప్రారంభించడానికి తాను సిద్ధమని స్పష్టీకరించారు. తప్పు ఎవరి వల్లనో జరిగి ఉండవచ్చు. ఇది సమాజం విషయం అయినందు వల్ల ప్రతిష్టాత్మకంగా తీసుకోకుండా పరిష్కారం కనుగొనాలన్నారు. జేడీఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీని కన్నా పెద్ద సమస్య మీది కాదన్నారు. మఠానికి ఇప్పుడు మరొక స్వామీజీని తేవాలని చెబుతున్నారు. యడియూరప్ప, సదానంద గౌడ సీఎంగా ఉన్న వేళ నిధులు కేటాయించారు. మురుగేష్ నిరాణి సొంత డబ్బులు ఇచ్చారు. మఠానికి విజయానంద కాశప్పనవర ఏం ఒరగబెట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 గంటల్లో పంచమసాలి సమాజానికి రిజర్వేషన్ ఇస్తామని ఎమ్మెల్యే కాశప్పనవరు ప్రకటించారు. అయితే ఆ మాట నిలబెట్టుకున్నారా? అని సీసీ పాటిల్ విజయానందను నిలదీశారు.
విధానసభ విపక్ష నేత అరవింద బెల్లద