
కూరగాయల ధరలు ౖపైపెకి
సాక్షి, బళ్లారి: గత కొన్ని రోజుల నుంచి కొన్ని కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ ధరలు కిలోకి బహిరంగ మార్కెట్‌లో రూ.80కి పైగా పలుకుతుండగా, అందులో సగం కూడా తమకు దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి వర్షాలు బాగా కురవడంతో రైతులు సాగు చేసిన కూరగాయలకు సాగునీటి సమస్య లేకపోగా వాతావరణం కూడా అనుకూలించడంతో పలు ప్రాంతాల్లో పచ్చిమిర్చి, క్యారెట్, వంకాయ, బీన్స్ తదితర కూరగాయల పంటలు చేతికిరావడంతో ప్రతి రోజు వాటిని మార్కెట్‌కు తెస్తున్నారు. నగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన ఏపీఎంసీకి ప్రతి రోజు పెద్ద ఎత్తున కూరగాయలు, ఆకుకూరలను తీసుకుని వస్తారు. రైతులు తాము పండించిన కూరగాయలు నేరుగా ఏపీఎంసీకి తెచ్చి, దళారుల ద్వారా మార్కెట్‌లో విక్రయిస్తారు. ఏపీఎంసీలో రైతులు, దళారుల నుంచి నగరంలోని చిన్న, చిన్న వ్యాపారులు తీసుకుని అంగళ్లు లేదా తోపుడుబండ్లలో కూరగాయలు విక్రయించడం పరిపాటి.
వినియోగదారుల జేబుకు చిల్లు
ఏపీఎంసీలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన కూరగాయలు వినియోగదారుల ఇంటికి చేరేటప్పటికి సగానికి సగం ధరలు పెరిగిపోతుండటంతో వినియోగదారుల జేబుకు చిల్లు పడుతోంది. ఎండుమిర్చి ధర పెరగకపోవడంతో మూడేళ్లుగా రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. అయితే పచ్చిమిర్చి ధరలు అమాంతంగా పెరగడంతో పచ్చిమిర్చి సాగు చేసిన రైతులకు కొంత ఊరట కలిగిస్తున్నా రైతుల కంటే మార్కెట్ వ్యాపారులకు అధిక లాభాలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది టమాటా ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో మేలైన టమాటా కిలో ధర రూ.30 పలుకుతున్నాయి. దీంతో ఇటు వినియోగదారులకు, రైతులకు కూడా పెద్దగా ఇబ్బందులు తలెత్తడం లేదు. టమాటా ధరలు ఇలా ఉండగా వంకాయ కిలో రూ.50, బీట్ రూట్ రూ.50, కాకర రూ.50, దోస రూ.50, వీటితో పాటు ఆరోగ్యానికి,ముఖ్యంగా షుగర్‌కు మేలు చేసే కాసరకాయ కిలో రూ.200 పలుకుతున్నాయి. కొన్ని కూరగాయలు ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో వినియోగదారులకు ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పచ్చి మిర్చి, క్యారెట్, బీన్స్ కిలో ధర రూ.80 పైనే
రైతుకు దక్కేది కిలోకి రూ.30 లేదా రూ.40 లోపే
నిలకడగా టమాటా ధరతో రైతులకు ఊరట