
దర్వేసి కంపెనీ నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: నగరంలో దర్వేసి కంపెనీ నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఎస్పీ విలేఖర్లతో మాట్లాడారు. దర్వేసి కంపెనీ ప్రజల నుంచి రూ.100కు 12 నుంచి 15 శాతం వడ్డీ చెల్లిస్తామంటూ కోట్లాది రూపాయలను దండుకొని అక్రమాలకు పాల్పడిన వారిని కోర్టులో హాజరుపరిచామన్నారు. ఒక్కొక్కరు రూ.1 లక్ష నుంచి రూ.20 లక్షలు చెల్లించిన ప్రజల తరఫున దర్వేసి కంపెనీ యజమాని మహ్మద్ హుసేన్‌తో మరికొంత మందిని పట్టుకున్నట్లు తెలిపారు. కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు.
ఖాకీ ఇంట్లో చోరీ
హుబ్లీ: కార్వార రోడ్డు పోలీస్ క్వార్టర్స్‌లోని ఓ పోలీస్ సిబ్బంది ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లిన దొంగలు బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. చాణిక్యపురి ఎల్.దొడ్డమని ఇంటి తాళం పగలగొట్టి 40 గ్రాముల బంగారు ఆభరణాలు, 100 గ్రాముల వెండి సామగ్రి, రూ.40 వేల నగదు చోరీ చేశారు. డీఏఆర్ మైదానం సునీల్‌కుమార్ లంబాణి ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కూడా చోరీకి గురయ్యాయి. ఉపనగర పోలీసులు ఈ రెండు కేసులను దర్యాప్తు చేపట్టారు.
మహిళ అదృశ్యం
హొసపేటె: నగరంలోని రాజీవ్ నగర్ నివాసి హేమావతి అనే 63 ఏళ్ల వయస్సుగల మహిళ ఈనెల 14న అదృశ్యం కావడంపై హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ఎస్‌ఐ ఓ ప్రకటనలో తెలిపారు. మహిళ 4.9 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖం, గోధుమ రంగు శరీరఛాయ, సాధారణ శరీరాకృతి కలిగి లేత మెరూన్ రంగు చీర, ముదురు నీలం రంగు రవిక ధరించిందని, కన్నడ, తెలుగులో మాట్లాడగలదని, ఈమె ఆచూకీ గురించి ఏదైనా సమాచారం ఉంటే హొసపేటె రూరల్ పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూం లేదా మొబైల్ నెంబర్ 9480805700లో సంప్రదించాలని కోరారు.
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఏడాది గడిచినా ప్రభుత్వం స్పందించలేదని దళిత ఐక్య పోరాట సమితి సంచాలకుడు అబ్రహం ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టినా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌కు వర్గీకరణ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా మౌనం వహించడం తగదన్నారు. జూలై నెలాఖరులోగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకపోతే ఆగస్టు 11 నుంచి బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ఆందోళన చేపడతామన్నారు. జిస్టిస్ నాగమోహన్ దాస్ నివేదికను వెంటనే అమలు పరచాలన్నారు.
ఇంటింటికీ పోలీస్ అభియాన్‌కు శ్రీకారం
రాయచూరు రూరల్: జిల్లాలో ఇంటింటికీ పోలీస్ కార్యక్రమం అమలు పరచనున్నట్లు అదనపు ఎస్పీ కుమారస్వామి పేర్కొన్నారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థను సామాన్య ప్రజలకు స్నేహితులుగా ఇంటింటికీ పోలీస్ నూతన పథకానికి శ్రీకారం చుట్టి మాట్లాడారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడడం, నేరాలను నియంత్రణలోకి తేవడం, నిర్భయ వాతావరణం నెలకొల్పడం పోలీస్ వ్యవస్థ బాధ్యత అని వెల్లడించారు. దీనికి ప్రజల సహకారం ఎంతైనా అవసరమన్నారు. మొబైల్ కోసం వేలాది రూపాయలు వ్యయం చేసే ప్రజలు ప్రాణ రక్షణ కోసం హెల్మెట్‌ను కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ శాంతవీర, సీఐలు నింగప్ప, నాగరాజ్, ఎస్‌ఐ సణ్ణ ఈరణ్ణ నాయక్‌లున్నారు.

దర్వేసి కంపెనీ నిందితుల అరెస్ట్

దర్వేసి కంపెనీ నిందితుల అరెస్ట్

దర్వేసి కంపెనీ నిందితుల అరెస్ట్