
కుందగోళకు లోకాయుక్త డీఎస్పీ భేటీ
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని కుందగోళ పట్టణంలోని శ్రీసితికంఠేశ్వర ప్రభుత్వ పీయూ కళాశాల ప్రిన్సిపాల్‌పై దాఖలైన కేసులకు సంబంధించి లోకాయుక్త డీఎస్పీ నేతృత్వంలోని బృందం గురువారం కళాశాలకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించింది. ఆ కళాశాలలో నిధుల దుర్వినియోగం, విజ్ఞాన వస్తు ప్రయోగాలయానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 లక్షల నిధుల్లో అవినీతిపై సామాజిక కార్యకర్త లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సదరు బృందం అక్కడికి వెళ్లింది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ గిరీష్ అంతర్గట్టిని విచారించింది. కొన్ని బిల్లులను పరిశీలించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గిరీష్ మాట్లాడుతూ కళాశాల కాంపౌండ్, ఉపాధ్యాయుల కొరత గురించి మాత్రమే తాను వారికి సమాచారం ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు.
ఆస్పత్రిలో విద్యుత్ కోతతో రోగుల నరకయాతన
హొసపేటె: తల్లీబిడ్డల ఆస్పత్రిలో బుధవారం రాత్రి దాదాపు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి పోవడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరాతో పాటు జనరేటర్ కూడా పని చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తల్లులు, నవజాత శిశువులు, ఐసీయూలో ఉన్న వారు సుమారు రెండున్నర గంటల పాటు నరకయాతన అనుభవించారు. విద్యుత్ వైఫల్యానికి కారణాన్ని తెలుసుకోవడానికి జెస్కాం అధికారులు కూడా ప్రయత్నించారు. చివరకు వేరే చోట నుంచి జనరేటర్‌ను కూడా తీసుకు రావడంతో ఆస్పత్రిలో ఉన్న బాలింతలు, నవజాత శిశువులు ఊపిరి పీల్చుకున్నారు.