
ప్రధానిగారూ.. రోడ్డేయండి
● చిన్నారి సింధూరి లేఖ
యశవంతపుర: తమ ఊరికి రోడ్డును నిర్మించాలని 8వ తరగతి విద్యార్థిని ఒకరు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా మలగారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సింధూరి లేఖలో సమస్యను వివరించింది. లోకనాథపుర గ్రామం నుంచి నుంచి 3–4 కిలోమీటర్ల దూరంలోని మలగారు పాఠశాలకు వెళ్తామని, మట్టి రోడ్డు కావడం వల్ల ఎప్పుడూ బురద, గుంతలతో ఉంటుందని తెలిపింది. వానా కాలం వస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. సకాలంలో పాఠశాలకు వెళ్లలేం, చదువులు సాగడం లేదు, అలాగే తమ గ్రామానికి అంబులెన్స్‌తో పాటు ఇతర వాహనాలు రావడం కష్టంగా మారింది. స్థానిక గ్రామ పంచాయతీ అధికారులకు తెలిపినా ప్రయోజనం లేదు. శాశ్వతంగా పరిష్కారం చేయాలని లేఖలో కోరింది.
శిశు హంతకునికి జీవితఖైదు
మైసూరు: తాగుడుకు భార్య డబ్బులివ్వలేదని 7 నెలల శిశువుని చంపిన కిరాతకునికి మైసూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. వివరాలు.. మైసూరులోని కనకగిరి నివాసి నాగేంద్ర, కూరగాయల వ్యాపారి. అతని భార్య రమ్య, వారికి 7 నెలల పసికందు సంతానం ఉంది. మద్యానికి బానిసైన నాగేంద్ర నిత్యం తాగుడుకు డబ్బులివ్వమని భార్యను వేధించేవాడు. 2022 ఏప్రిల్ 24న భార్యను డబ్బుల కోసం వేధిస్తూ, డబ్బులివ్వకుంటే చిన్నారిని చంపుతానని బెదిరించాడు. వెంటనే రమ్య బిగ్గరగా అరుస్తూ ఇంటి నుంచి బయటకు, నాగేంద్ర తక్కెడతో చిన్నారిని కొట్టి చంపాడు. విద్యారణ్యపురం స్టేషన్ పోలీసులు నిందితున్ని పట్టుకుని అతనిపై కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. విచారణ జరిపిన జడ్జి వీహెచ్ దయానంద్ ఆరోపణలు రుజువైన నేపథ్యంలో నాగేంద్రకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రభుత్వం తరఫున ఎం.కామాక్షి వాదించారు.
ఆస్పత్రుల్లో ఆహారం తనిఖీ
మైసూరు: నగరంలోని కేఆర్ ఆస్పత్రి, చెలువాంబ ఆస్పత్రులను బుధవారం రాష్ట్ర ఆహార కమిషన్ అధ్యక్షుడు డాక్టర్ హెచ్.కృష్ణ తనిఖీ చేశారు. చెలువాంబ ఆస్పత్రిలో తల్లీబిడ్డలకు అందిస్తున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. భోజనం మెనూ, రోగులకు సరిగా చికిత్స అందుతోందా? మాత్రలను సక్రమంగా పంపిణీ చేస్తున్నారా? అని అడిగారు. సమయానికి సరిగా విధులకు హాజరు కావాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో పరిశుభ్రతను కాపాడాలని ఆదేశించారు. ఆహార పౌర సరఫరా శాఖ జేడీ మంటేస్వామి, మైసూరు మెడికల్ కాలేజీ డీన్, డైరెక్టర్ దాక్షాయణి, అధికారులు పాల్గొన్నారు.
గజ దాడిలో ఇల్లు ధ్వంసం
యశవంతపుర: కొడగు జిల్లా మడికెరి వద్ద అడవి ఏనుగు ఓ ఇంటిని ధ్వంసం చేసింది. యవకపాడి గ్రామంలో కుడియర కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఓ ఏనుగు చొరబడింది. ఓ ఇంటి పక్కన ఉన్న కొబ్బరి చెట్టును కూల్చగా ఆ చెట్టు ఇంటి మీద పడింది. దీంతో పెంకుటిల్లు ఓ వైపు నాశనమైంది. అలాగే పరిసరాల్లోని పంట పొలాలను పాడుచేసింది. ఈ సమయంలో ఇంట్లో వారు వేరే ఊరికి వెళ్లి ఉండడంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే మరమ్మతులకు డబ్బులు ఎలా అని ఆవేదన చెందారు. రెండేళ్ల నుంచి ఏనుగులు దాడుల వల్ల అపారంగా నష్టపోతున్నట్లు మడికెరి తాలూకా గిరిజన వ్యవసాయ సంఘం అధ్యక్షుడు కుడియర ముత్తప్ప తెలిపారు. గిరిజనుల ఇళ్లు ధ్వంసమై లక్షల రూపాయలను నష్టపోతున్నట్లు వివరించారు. ఇంటి యజమానికి, రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రధానిగారూ.. రోడ్డేయండి

ప్రధానిగారూ.. రోడ్డేయండి