
రౌడీ హత్య.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు
శివాజీనగర: బెంగళూరులో రౌడీషీటర్ బిక్లు శివకుమార్ (40) హత్య కేసులో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నగరంలోని కేఆర్ పురం ఎమ్మెల్యే భైరతి బసవరాజును 5ఎ నిందితునిగా పేర్కొన్నారు. హతుని తల్లి ఫిర్యాదు మేరకు... ఆమె కుమారుడు శివప్రకాశ్ ఏడాది నుంచి ఓ కంపెనీ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్నందున అతనిపై రౌడీషీట్ కూడా ఉంది. 2023లో అతని షెడ్డులోకి కొందరు ప్రవేశించి ధ్వంసం చేశారు. స్థలాన్ని తమ పేర రాసివ్వకపోతే ప్రాణాలతో విడచిపెట్టమని బెదిరించారు. భైరతి బసవరాజ్, విమల్ తదితరుల నుంచి ప్రాణభయం ఉందని ఇంట్లో చెప్పేవాడు. జూలై 15న ఇంటికి వచ్చి భోజనం చేసి, రాత్రి 8 గంటలకు బయటికి వచ్చాడు, శివ, డ్రైవర్ ఇమ్రాన్ ఖాన్, లోకేశ్ మాట్లాడుకొంటూ నిల్చుకొన్నారు. కొంతసేపటికి వారిద్దరూ వెళ్లిపోయారు. ఇంతలో 8–9 మంది గుర్తు తెలియని దుండగులు కొడవళ్లతో దాడి చేశారు. విడిపించేందుకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్‌ను కూడా రాడ్‌తో కొట్టారు. లోకేశ్ మొబైల్ ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. దుండగులు శివని హత్య చేసి తెలుపు రంగు స్కార్పియోలో పరారయ్యారు అని తెలిపింది. కిత్తకనూరు స్థలం కోసం జగదీశ్, కిరణ్, విమల్, అనిల్ అనేవారు ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ ప్రోద్బలంతో తన కొడుకును హత్య చేశారని ఆరోపించారు. కిరణ్, విమల్, ప్రదీప్, మదన్, సామ్యేల్ ప్యాట్రిక్ అనేవారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఏ5గా నమోదు
బెంగళూరులో సంచలనం
నాకేం తెలియదన్న ఎమ్మెల్యే బసవరాజ్
నాకేమీ తెలియదు: బైరతి
ఈ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే భైరతి బసవరాజ్ చెప్పారు. ఎవరు చనిపోయారో, ఎవరు చంపారో నాకు ఏమీ తెలియదు. కావాలనే నామీద ఎఫ్‌ఐఆర్ వేశారు. ఎవరో కావాలని ఫిర్యాదు చేసి ఉండవచ్చు. నేను న్యాయ పోరాటం చేస్తాను. హోం మంత్రి జీ.పరమేశ్వర్‌ను కలిసి వాస్తవాలను తెలియజేస్తాను అని చెప్పారు.

రౌడీ హత్య.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు