
గృహిణిపై కీచకపర్వం
● ఖాకీ అరెస్టు
యశవంతపుర: మహిళపై అత్యాచారం కేసులో పోలీసు కానిస్టేబుల్‌ను దక్షిణకన్నడ జిల్లా మంగళూరు కంకనాడి పోలీసులు అరెస్ట్ చేశారు. కావూరు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న చంద్రనాయక్ నిందితుడు. మంగళూరు నగర పోలీసు కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి వివరాలను వెల్లడించారు. బాధిత మహిళను ఆమె భర్త నగ్న వీడియోలను తీసి తాను చెప్పినట్లు చేయాలని బెదిరించసాగాడు. భర్త వేధింపులను తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో చంద్రనాయక్‌ను ఆమెతో మాట్లాడాడు. భర్త ఫోన్‌లోని వీడియోలను అతడు తొలగించడంతో సమస్య సద్దుమణిగింది. అప్పటినుంచి బాధితురాలికి మాయమాటలు చెప్పిన చంద్రనాయక్ లైంగికంగా వాడుకున్నాడు. ఇందుకు భర్త కూడా సహకరించాడు. ఇద్దరి వేధింపులు మితిమీరడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసు కమిషనర్ సుధీర్‌కుమార్ రెడ్డిని కలిసి తన గోడును వెల్లబోసుకుంది. ఆయన ఆదేశాలతో చంద్రనాయక్‌ను, ఘరానా భర్తని అరెస్టు చేశారు.
సర్కారు భూమి స్వాహా...
ఐఏఎస్‌పై కేసు
శివాజీనగర: వందల కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి అక్రమాలలో ఐఏఎస్ అధికారిణి వాసంతి అమర్‌పై బెంగళూరు హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గతంలో ప్రత్యేక జిల్లాధికారిగా ఉండిన వాసంతి అమర్.. బెంగళూరు ఉత్తర తాలూకాలోని దాసనపుర హొబ్లి హుచ్చనపాళ్యలో 10 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతరులకు అమ్మేశారని ఆరోపణలున్నాయి. బెంగళూరు విభాగపు ప్రాంతీయ కమిషనర్ ఆదేశాలతో ఓ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ భూమి విలువ రూ.100 కోట్లు ఉంటుందని అంచనా.