సాక్షి బళ్లారి: వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. అయితే కొందరు వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తూ లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ వారికి కేటాయించిన(నిర్ణీత) సమయంలో సేవలు అందించకుండా ఇలా వచ్చి అలా బయటకు వెళ్లిపోతూ విధులకు డుమ్మా కొడుతున్న ప్రభుత్వ డాక్టర్లకు చెక్ పెట్టేందుకు ప్రయోగాత్మకంగా, వినూత్నంగా లొకేషన్ పద్ధతిలో హాజరు స్వీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని విమ్స్ ఆస్పత్రిలో వెయ్యి మంది వైద్యులు పని చేస్తుండగా ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు 800 మందికి పైగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. వందలాది మంది ప్రభుత్వ నిపుణులైన వైద్యులు ఉన్నా ప్రైవేటు ఆస్పత్రులు ఉదయం నుంచి రాత్రి వరకు రోగులతో కిటకిటలాడుతుంటాయి. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు పేదోడి నుంచి కోటీశ్వరుడి వరకు ప్రైవేటు క్లినిక్‌లు, నర్సింహోంల్లో చికిత్సలు చేయించుకుంటున్నారంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఏమేరకు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇకపై నామమాత్ర సేవలకు చెక్
ఏటేటా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు నామమాత్రంగా పని చేస్తూ నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లకు అధిక సమయం కేటాయిస్తూ ఇటు ప్రభుత్వం నుంచి నెలనెలా లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. క్లినిక్‌లలో రోజుకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు టోకెన్ల రూపంలో వైద్య సేవలు అందిస్తూ డాక్టర్లు ఆర్జిస్తున్నారు. ఈ విషయం పాలకులకు ఎన్నో ఏళ్లుగా తలనొప్పిగా మారింది. విమ్స్ ఆస్పత్రిలో అన్ని రకాల రోగాలకు నిపుణులైన డాక్టర్లు ఉన్నా అందులో 75 శాతం మంది డాక్టర్లు కనీసం ఒకటి, రెండు గంటలు కూడా పని చేయడం లేదని విమర్శలున్నాయి. ఇక జిల్లాలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలు, నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు చిన్న చిన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో అక్కడ కూడా సగం మంది వైద్యులు హాజరు పట్టికలో అటెండెన్స్ వేసి ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లినిక్, నర్సింగ్‌హోంల్లో పని చేస్తూ మళ్లీ సాయంత్రం 5 గంటలకు ఇలా వచ్చి అలా బయటకు వెళ్లిపోయే డాక్టర్లు ఉండటంతో వారికి చెక్ పెట్టేందుకు మొబైల్ లొకేషన్ పద్ధతిలో జియో ట్యాగ్ ద్వారా వైద్యుడు ఎక్కడ పని చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని సంబంధిత ఇన్‌చార్జ్‌కు తెలియజేసే విధంగా చర్యలు చేపడుతున్నారు.
కొలిక్కి వస్తున్న కార్యాచరణ
ఇందుకు సంబంధించి కార్యాచరణ దాదాపు పూర్తి కావస్తోంది. లొకేషన్ పద్ధతిలో వైద్యులు సేవలు అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేయాలన్న వారికి కొంత సమస్యగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ జియో ట్యాగ్ లొకేషన్ అధారంగా వారి వారి సెల్‌ఫోన్లకు, ఇన్‌చార్జ్ ఉన్నతాధికారులకు నేరుగా లింక్ కల్పిస్తూ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు లేదా వారికి కేటాయించిన సమయంలో కచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. లొకేషన్ పద్దతిలో ఫోటోతో పాటు వారు పని చేసే ఆస్పత్రి పరిధిలో 100 మీటర్ల దూరం వరకు పని చేస్తూ ఉంటుంది. మొబైల్ తప్పని సరిగా చేతిలో పెట్టుకొని లొకేషన్ అధారంగా ఇకపై ఆయా ఆస్పత్రుల్లో వైద్య సేవలను అందించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ పద్ధతి వీలైనంత త్వరగా అమల్లోకి తెచ్చి కార్యాచరణ పూర్తి చేస్తే కొద్ది వరకై నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు తమ విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.
ఆరోగ్య శాఖ పరిధిలో వినూత్న ప్రయోగం
ప్రైవేటు దోపిడీకి చెక్ పెట్టేందుకు వ్యూహమా?
ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిలో ఆందోళన
ఆస్పత్రుల్లో లొకేషన్ పద్ధతిలో హాజరు