
యరగేరా తాలూకాను ప్రకటించండి
రాయచూరు రూరల్: రాయచూరు నుంచి 25 కి.మీ దూరంలోని యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని యరగేరా తాలూకా పోరాట సమితి అధ్యక్షుడు నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభ సభ్యుడి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌కు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రజలకు అనుకూలమయ్యే విధంగా తాలూకాను ఏర్పాటు చేయడానికి అన్ని సౌకర్యాలున్నాయన్నారు. యరగేర వద్ద 256 ఎకరాల్లో ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వ విద్యాలయం ఉందన్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి– 167 ఉందన్నారు. యరగేర పరిధిలో 19 గ్రామ పంచాయతీలు, 78 గ్రామాలు ఉన్నాయన్నారు. 2020 నుంచి యరగేరాను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి కుమార నాయక్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో బసవరాజ్, మెహబూబ్ పటేల్, విద్యానందరెడ్డి, తాయప్ప, మహ్మద్ రఫీలున్నారు.