
గత 50 ఏళ్లలో వర్షాకాలంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, బెంగళూరు: ఎప్పుడూ సరాసరి చల్లదనంతో ఉండేది బెంగళూరు నగరం అని పేరు. అందుకే దేశంలో ఎక్కడెక్కడి నుంచో నగరానికి వచ్చి జీవిస్తున్నారు. కానీ చల్లని వాతావరణం కనుమరుగవుతోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉద్యాన నగరి వాతావరణంలో వస్తున్న మార్పులే ఇందుకు కారణమని చెప్పాలి. గతంలో మాదిరి ఎప్పుడూ చల్లదనం కనిపించడం లేదు. నెమ్మదిగా ఐటీ సిటీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఒక్కరోజులో ఎండ, వర్షం, చలి ఇలా అన్ని రకాల పరిస్థితులను నగరవాసులు చూస్తున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాముల్లో తీవ్రమైన చలి, మధ్యాహ్నం వేళ చుర్రుమనే ఎండలు, సాయంత్రం, రాత్రి వేళల్లో చిరుజల్లులు, ఇలా బెంగళూరులో విపరీతమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీని వల్ల అనారోగ్య పీడితులు ఇబ్బందులు పడుతున్నారు.
34 డిగ్రీల ఎండ
నగరీకరణ, పారిశ్రామికాభివృద్ధి, అడవుల ఆక్రమణ, విపరీతమైన వాహన కాలుష్యం తదతరాలను కారణాలని చెప్పాలి. నేడు వర్షాకాలంలో సైతం అధికమైన మండుటెండలను నగరవాసులు చవిచూస్తున్నారు. బెంగళూరులో వర్షాకాలంలో సాధారణంగా 27 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ ఇటీవల కాలంలో 30 నుంచి 34 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో ఆకాశంలో మబ్బులు కమ్మేసినప్పటికీ కూడా ఉక్కపోతతో నగరం ఇబ్బంది పడుతోంది. కొద్దిసేపు ఎండ, అంతలోనే మేఘావృతమై జల్లులు పడుతుంటాయి.
చల్లదనం క్షీణత
క్రమక్రమంగా వర్షాకాలంలో కూడా పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. చల్లదనం ప్రమాణం గతంలో కంటే చాలా వరకు తగ్గిపోయింది. ముఖ్యంగా కళ్యాణ కర్ణాటక లో ఉండే కలబురిగి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాల్లో 30 డిగ్రీల సెల్సియస్ మేర పగటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. బెంగళూరు కూడా మినహాయింపు కాదు. మరోవైపు దేశంలో చాలా వరకు అన్ని నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి.
ఢిల్లీ కంటే ఎక్కువే
దేశ రాజధాని ఢిల్లీ కంటే కూడా బెంగళూరులో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. పొరుగు రాష్ట్రం తమిళనాడు నుంచి తూర్పు వడగాలులు వీస్తుండడంతో రాజధానితో పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వేడి తీవ్రత పెరిగింది. రానున్న మరో వారం, పక్షం రోజుల్లో రాష్ట్రంలో చల్లటి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
బెంగళూరులో విపరీత వాతావరణం
వర్షాకాలంలో ఎండ వేడిమి
అంతలోనే జల్లు వర్షం
రాత్రివేళ చలిగాలులు
ఏడాది ఉష్ణోగ్రత (సెల్సియస్ డిగ్రీల్లో)
1970 16–18
1990 19
2000 21
2010 28
2025 34

గత 50 ఏళ్లలో వర్షాకాలంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు

గత 50 ఏళ్లలో వర్షాకాలంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు

గత 50 ఏళ్లలో వర్షాకాలంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు