
ఇంటికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద ఘోరం జరిగింది. బెంగళూరు నుంచి బుల్లెట్ బైక్‌లో ఇంటికి వస్తున్న టెక్కీ.. కొంతసేపట్లో ఇంటికి చేరుకోనుండగా కిందపడి దుర్మరణం చెందాడు. కొడుకు మంచి ఉద్యోగం సంపాదించాడని తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు, అయితే విధి చిన్నచూపు చూసి శోకం మిగిల్చింది. వివరాలు.. తాడిపత్రి పట్టణంలో కడవ చలపతి, జయమ్మ దంపతులు ఉంటున్నారు. చలపతి ఓ గ్రానైట్ షాపులో గుమాస్తా పని చేసేవాడు. వీరికి ఒక కుమారుడు బాలాజీ (26), కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు బాలాజీ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గత 3 ఏళ్లుగా చైన్నెలో కాగ్నిజెంట్‌లో పనిచేస్తూ ఏడాది నుంచి బెంగళూరులో టెక్ మహీంద్రలో ఉద్యోగంలోకి మారాడు. ఏడాదికి రూ. 14 లక్షల వేతనం వచ్చేది.
వర్క్ ఫ్రం హోం అని..
15 రోజులు ఆఫీసులో, 15 రోజులు వర్క్ ఫ్రం హోం కింద విధులు నిర్వహించాలి, వర్క్ ఫ్రం హోం రావడంతో శనివారం తెల్లవారు జామున బెంగళూరు నుంచి బుల్లెట్ ద్విచక్ర వాహనంలో ఇంటికి బయల్దేరాడు. బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో అనంతపురం – తాడిపత్రి హైవేలో అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. తలకు హెల్మెట్ ఉన్నా ప్రాణాలు కాపాడలేక పోయింది.
పెళ్లి చేద్దామనుకుంటిమే
స్థానికులు చూసి జేబులో ఉన్న వివరాల ప్రకారం తండ్రి చలపతికి కాల్‌చేసి చెప్పగా పరుగున వచ్చారు. విగతజీవిగా పడి ఉన్న కుమారున్ని చూసి బోరుమని విలపించాడు. కుమారునికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఇంకా కొన్ని రోజులు ఆగండి నాన్నా, మంచి జీతం వస్తుంది, అప్పుడు చేసుకుంటానని చెప్పిన మాటలు తలుచుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. వర్క్ ఫ్రం హోం ఉందని చెప్పి ఇంటికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు వెల్లిపోయావా అంటూ కుమారున్ని పట్టుకుని రోదించడం చూసి అందరూ కంటతడి పెట్టారు.
బైక్ ప్రమాదంలో టెక్కీ దుర్మరణం
బెంగళూరు నుంచి తాడిపత్రికి
వెళ్తుండగా ఘటన

ఇంటికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు