
పెండింగ్ పనులు పూర్తి చేస్తాం
సాక్షి,బళ్లారి: బళ్లారి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అవసరమైన చోట్ల రైల్వే ఎఫ్‌ఓబీ(ఫ్లైఓవర్ బ్రిడ్జి) నిర్మాణాలతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాత్రి బళ్లారికి ప్రత్యేక రైలులో విచ్చేశారు. ఈ సందర్భంగా బళ్లారి రైల్వే స్టేషన్‌లో మాజీ మంత్రి శ్రీరాములు, నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, రైల్వే క్రియాశీల సమితి అధ్యక్షుడు మహేశ్వరస్వామి తదితరులు కలుసుకుని ఘన స్వాగతం పలికారు. అనంతరం సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరస్వామి జిల్లాలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు సంబంధించి వినతిపత్రం అందజేశారు. రైల్వే స్టేషన్లలో సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్లపై మంత్రికి విన్నవించారు. సమితి అందజేసిన మనవి పత్రానికి సానుకూలంగా స్పందించి వీలైనన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైలు మార్గాలను పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నానన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. బళ్లారి నగరంతో పాటు జిల్లాలోని మోతీ సమీపంలో బ్రిడ్జి వెడల్పు చేయాలని, కనకదుర్గమ్మ ఆలయం వద్ద మయూర హోటల్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, రేడియో పార్కు సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని, గుగ్గరహట్టి వద్ద ఫ్లైఓవర్, బైపాస్ వద్ద, దరోజీ సమీపంలో ఫ్‌లైఓవర్ ఏర్పాటు చేయాలని సమితి విన్నవించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైల్వే ఎఫ్‌ఓబీల ఏర్పాటుకు చర్యలు
కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సోమణ్ణ