
మాజీ ఎమ్మెల్సీ తిప్పణ్ణ కన్నుమూత
సాక్షి,బళ్లారి: సీనియర్ న్యాయవాది, మాజీ విధాన పరిషత్ సభ్యుడు, మాజీ అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు తదితర ఎన్నో పదవులను అలంకరించి వాటికి వన్నె తెచ్చిన సీనియర్ రాజకీయ దురంధరుడు ఎన్.తిప్పణ్ణ(97) ఇక లేరు. ఆయన శుక్రవారం నగరంలోని తన నివాస గృహంలో వయస్సు రీత్యా అనారోగ్య కారణాలతో మృతి చెందారు. జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడుగా గుర్తింపు పొందిన ఈయన అంచెలంచెలుగా ఎన్నో పదవులు చేపట్టారు. రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని, మచ్చలేని నాయకుడుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్సీగా సేవలందించి, సభాపతిగా కూడా పని చేశారు. 2012 నుంచి అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నో సంవత్సరాలు సేవలందించారు. వీరశైవ లింగాయత్ సమాజంలోనే కాకుండా అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, పేదలకు తనదైన సేవలు అందించేవారు.
విద్యాభివృద్ధికి ఇతోధిక కృషి
వీరశైవ విద్యావర్ధక సంఘానికి అధ్యక్షుడుగా పని చేసి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఎన్నో సంవత్సరాల పాటు న్యాయవాదిగా కూడా పని చేయడంతో జిల్లా కోర్టుల్లోనే కాకుండా హైకోర్టుల్లో కూడా తిప్పణ్ణ ఒక వెలుగు వెలిగారు. ఆయన సొంత ఊరు చిత్రదుర్గ జిల్లా తురువనూరు కాగా ఆయన అంత్యక్రియలు తురువనూరులో శనివారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు కుమారుడు ఉన్నారు. ఎన్.తిప్పణ్ణ మృతిపై కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణ, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి, నగర ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి తదితర ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈయన మృతి జిల్లాకు తీరని లోటు అని, జిల్లాభివృద్ధికి తన వంతు కృషి చేశారని, రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పరితపించేవారని కొనియాడారు.