
నేడు గురు పౌర్ణమి వేడుకలు
బళ్లారిఅర్బన్: గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం బాబాకు అలంకరణ, ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతపూజలను అర్చకులు నరసింహ స్వామి నిర్వహించారని దేవస్థాన ధర్మకర్త నామాల కుమారస్వామి తెలిపారు. గురు పౌర్ణమి వేడుకలకు నగరంలోని షిర్డీ సాయిబాబా ఆలయాలు ముస్తాబయ్యాయి. అనంతపురం రోడ్డులో ఎంజీ సమీపంలోని విశాల్‌నగర్‌లో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం తెల్లవారు జాము నుంచి కాకడ హారతి, గణపతి పూజ, సాయిబాబాకు పంచామృత, క్షీరాభిషేకం, అలంకరణ, భక్తి గీతాలు, కీర్తనలు, అర్చనలు, లఘు హారతి, మహామంగళ హారతి అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. యువతీ యువకులైన భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. ఆలయం వద్ద భక్తులకు అనుకూలం కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. కాగా నగరంలోని కౌల్‌బజార్ షిర్డీ సాయిబాబా ఆలయంలో, కోటలో వెలసిన షిర్డీసాయి బాబా ఆలయంలో, పటేల్ నగర్‌లో వెలసిన షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పూజలు జరుపుకునేందుకు భక్తులకు ఏర్పాట్లు చేశారు.
ముస్తాబైన షిర్డీ సాయిబాబా ఆలయాలు

నేడు గురు పౌర్ణమి వేడుకలు