
సిద్దూ సర్కారులో అవినీతి తాండవం
బళ్లారిఅర్బన్: రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి ప్రజలకు ఉత్తమ పాలన అదించడంలో పూర్తిగా విఫలం అయిందని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ ఆరోపించారు. ఆయన డీసీ కార్యాలయ ఆవరణలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి పెరిగి పోయిందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఆరోపణలే దీనికి నిదర్శనం అన్నారు. గృహ వసతి శాఖలో లంచం ముట్టనిదే పనులు కావడం లేదని ఎంఆర్ పాటిల్ చేసిన ఆరోపణలను గుర్తు చేశారు. ఈ విషయంలో ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు అసంతృప్తిగా ఉంటూ బహిరంగంగా మండిపడుతున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయినా ఇప్పటి వరకు కనీస వసతులైన రోడ్లు, వంతెనలు, చెరువుల పునరుద్ధరణ, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలం అయిందన్నారు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. పేదలు, రైతుల వ్యతిరేక సర్కారు ఇది అని మండిపడ్డారు. షెడ్యూల్ కులాలకు కేటాయించిన నిధుల విడుదలలో కూడా పక్షపాతం చూపుతున్నారన్నారు. ఫలితంగా ఆ వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం కేవలం కొన్ని వర్గాలను బుజ్జగించడానికే తాపత్రయ పడుతుందని విమర్శించారు. మిగిలిన వర్గాలకు ఎంతో అన్యాయం జరుగుతుందన్నారు. తక్షణమే ఈ ప్రభుత్వం పక్షపాత ధోరణికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్‌ను ఆ స్థానం నుంచి తొలగించాలని సీఎంను డిమాండ్ చేశారు. ఆ పార్టీ ప్రముఖులు కిరణ్‌కుమార్, రాజునాయక్, లక్ష్మికాంతరెడ్డి, పుష్ప, జమిల, హొన్నూరుస్వామి, అశోక్ సంగనకల్లు తదితరులు పాల్గొన్నారు.