
హుబ్లీ ధార్వాడ పాలికెకు కొత్త రథసారథులు
హుబ్లీ: హుబ్లీ ధార్వాడ నగర పాలికె సంస్థ కొత్త మేయర్‌గా బీజేపీ తరపున జ్యోతిపాటిల్, డిప్యూటీ మేయర్‌గా సంతోష్ చవాన్ ఎన్నికయ్యారు. పాలికె కార్యాలయంలో 24వ అవధికి సంబంధించి 19వ వార్డు కార్పొరేటర్ జ్యోతి పాటిల్ అత్యధిక 47 ఓట్లతో మేయర్‌గా ఎన్నికయ్యారు. పాలికె 49వ వార్డు కార్పొరేటర్ సంతోష్ చవాన్ కూడా 47 ఓట్లను పొంది డిప్యూటీ మేయర్‌గా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి బెళగావి డివిజన్ కమిషనర్ ఎస్‌బీ శెట్టన్నవర్ ప్రకటించారు. కాగా విపక్ష కాంగ్రెస్ తరపున 59వ వార్డు కార్పొరేటర్ ప్రవాసాంధ్ర మహిళా నాయకురాలు సువర్ణ కల్వకుంట్ల, 76వ వార్డు కార్పొరేటర్ వహీదాఖానం అల్లాభక్షి కిత్తూరు వరుసగా డిప్యూటీ మేయర్ స్థానాల కోసం నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ మేయర్ పదవికి 14వ వార్డు కార్పొరేటర్ శంభుగౌడ రుద్రగౌడ కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఈ ఎన్నికలను సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా తమ ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో పాలికె కార్పొరేటర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మొత్తం 90 మంది ఎన్నికల్లో పాల్గొన్నారు.
ఎన్నికలకు ముగ్గురు గైర్హాజరు
తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం 87 మంది పాల్గొనగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. అదనపు డివిజినల్ కమిషనర్ ఎస్‌ఎస్ బిరాదార్, పాలికె కమిషనర్ రుద్రేష్ గాళి ఎన్నికలను పర్యవేక్షించారు. కొత్త మేయర్ జ్యోతి పాటిల్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కనీస వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతను ఇస్తానన్నారు. రక్షిత మంచి నీరు, చెత్త నిర్వహణ తీవ్ర సమస్యగా ఉందన్నారు. ఈ రెండింటిని తొలి ప్రాధాన్యతగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. జంట నగరాల సౌదర్యానికి కూడా తగు ప్రాధాన్యతను ఇస్తానన్నారు. ఇక ఆరోగ్యం దృష్యా పాలికె ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలకు కృషి చేస్తానన్నారు. వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసానికి జంట నగరాలకు వస్తారు. వారికి కనీస సౌకర్యాలు దక్కేలా చూస్తానన్నారు. సీనియర్ల సలహా సూచనలను తీసుకుని వారిని విశ్వాసంలోకి పరిగణించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు శ్రమిస్తానన్నారు.
మేయర్‌గా జ్యోతి పాటిల్
ఉప మేయర్‌గా సంతోష్ చవాన్