
మహాద్భుతం.. పనస సంరక్షణ క్షేత్రం
కోలారు: కోలారు సమీపంలోని ఉద్యాన(హార్టికల్చర్) విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించగానే విరగ కాసిన కాయలతో అలరారుతున్న పనస చెట్లు స్వాగతం పలుకుతాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న దాదాపు 46 ఎకరాల విస్తీర్ణంలో ఎక్కడ చూసినా పనస చెట్లు దర్శనమిస్తాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో 5 కి.మి.ల దూరంలో ఉన్న హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టిన వారికి తాము కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది. ఈ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం రాష్ట్రంలోనే మొదటి పనస సంరక్షణా క్షేత్రం అని కూడా ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ దాదాపు 1600లకు పైగా పనస చెట్లు ఉన్నాయి. ప్రతి చెట్టుకు ఒక్కో సంఖ్య ఇచ్చారు. కొన్ని పనస చెట్ల కింద ఆ పనస ఏ రకానికి చెందినదనే వివరాలు రాసి ఉంచారు. ఒక్కొక్క చెట్టులోను పనస ఆకృతి, సైజు, వాటి రుచి, లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. పనస కొమ్మలకు విరివిగా కాసిన పనస కాయలు చూడడానికి ఎంతో ముచ్చటగా కనిపిస్తాయి. కొన్ని చెట్ల మొదలులోనే పనస కాయలు కాచి ఉండడాన్ని గమనించవచ్చు. మరో చెట్టులో మొదలు నుంచి కొన వరకు పనస కాయలు విరగకాశాయి. సీజన్‌లో మాత్రమే కాకుండా యేడాది పొడవునా పనసకాయలు కాచే రకాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ విధంగా తోట నిండా పనస రకాల లోకమే మనకు దర్శనమిస్తుంది.
50 వసంతాల పనస తోట
కర్ణాటక హార్టికల్చర్ పితామహుడు దివంగత ఎం.హెచ్.మరిగౌడ దూరదృష్టి ఫలితంగా 1969వ సంవత్సరంలో మహాత్మాగాంధీ జన్మశతమానోత్సవం సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హార్టికల్చర్ శాఖ నుంచి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 100 పనస తోటలను పెంచాలని మరిగౌడ సంకల్పం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే నగర సమీపంలోని టమక వద్ద పనస తోట తలెత్తింది. భూస్వాధీనం తదితర ప్రక్రియల కారణంగా 1973లో ఈ పనస తోటలో పనస మొక్కలను నాటడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉన్న పనస చెట్లు 1973–75 సంవత్సరాల మధ్య నాటినవి. అంటే ఈ పనస తోట 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ పనస తోటలో ఆరంభం నుంచే విత్తనాల ద్వారా మొక్కలను పెంచి నాటారు. హార్టికల్చర్ శాఖ అధికారులు ఎక్కడ నాణ్యమైన పనస పళ్లు కనిపించినా వాటి విత్తనాలను తెచ్చి మొక్కలుగా పెంచి పోషించేవారు. సుమారు మూడున్నర దశాబ్దాల కాలం పాటు ఈ చెట్లను ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించారు. ప్రస్తుతం ఈ చెట్లు ఉత్తమ ఫలాలను అందిస్తున్నాయి. 2009లో ఈ పనస క్షేత్రంలో బాగలకోటె విశ్వవిద్యాలయానికి చెందిన హార్టికల్చర్ కళాశాల ప్రారంభమైంది. అనంతరం పనస తోటను హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. అంతకు ముందు ఈ క్షేత్రం పనస రకాల సేకరణ కేంద్రంగా ఉండింది. విశ్వవిద్యాలయానికి అప్పగించిన అనంతరం శాసీ్త్రయంగా పనస రకాల అభివృద్ధి ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో విశ్వవిద్యాలయ, కళాశాల శాస్త్రవేత్తలు చెట్లను రక్షణ చేయడంతో పాటు వివిధ రకాల పనస వంగడాల అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తున్నారు. అభివృద్ధి చేసిన పనస రకాలను రైతులకు కూడా అందిస్తున్నారు. ఈ పనస క్షేత్రంలో ప్రతియేటా పనస కాయలను వేలం వేస్తారు. వ్యాపారులు వేలంలో పనస కాయలను కొంటారని వ్యవసాయ విజ్ఞాన కేంద్రం ప్రముఖుడు శివానంద హొంగల్ తెలిపారు. ఇప్పటికీ ఎంతో మంది ఇతర ప్రాంతాల నుంచి రైతులు, విద్యార్థులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.
ఉద్యాన విశ్వవిద్యాలయం ఆవరణలో
పనసకాయల తోట
చూపరులకు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన అనుభూతి

మహాద్భుతం.. పనస సంరక్షణ క్షేత్రం

మహాద్భుతం.. పనస సంరక్షణ క్షేత్రం