
పల్లె నుంచి ప్రపంచ స్థాయికి..
హుబ్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్‌లోని యోగా అంతర్జాతీయ స్థాయిలో కూడా వ్యాప్తి చెంది యోగా శిక్షకులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. హుబ్లీ సమీపంలోని కుందగోళ తాలూకా యువత వియత్నాంలో భారతీయ యోగాను నేర్పిస్తున్నారు. ఆ మేరకు గత 10 ఏళ్ల నుంచి ఆ దేశంలో లక్ష మందికి పైగా శిక్షణ ఇచ్చారు. భారత్‌కు చెందిన వేలాది మంది విదేశాల్లో యోగా శిక్షకులుగా పని చేస్తున్నారు. అందులో ముఖ్యంగా కుందగోళ తాలూకాకు చెందిన వందలాది యువకులు వియత్నాం దేశంలో యోగా శిక్షకులుగా రాణిస్తున్నారు. వియత్నాంలోని హోచిమిన్ నగరం, పక్కన ఉన్న నగరంలో యోగా శిక్షణ, బోధన తరగతులు, శిబిరాల నిర్వహణలో వీరు నిమగ్నులయ్యారు. ఆ మేరకు వీరితో శిక్షణ పొందిన యోగా శిక్షకులు ప్రస్తుతం వివిధ చోట్ల శిక్షణ ఇవ్వడం గమనార్హం. కుందగోళ, చిక్కనార్టి, ఎరినారాయణపుర తదితర గ్రామాలకు చెందిన యువకులు యోగా శిక్షకులుగా పని చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. చిక్కనార్టి రాజీవ్ కుమార్ సోమరెడ్డి, ఎరినారాయణపుర సురేష్ కేరి, సంతోష్, ముత్తప్ప, ఈరణ్ణ మఠద, దేవరాజ్, అప్పు పరంగి, వెంకటేష్ యోగా శిక్షకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. వాస్తవంగా యువకులకు యోగా శిక్షకులుగా మారాలన్న ఉద్దేశం లేదు. అయితే కుందగోళ శివానంద మఠంలో, హైస్కూల్‌లో చదువుతున్న సందర్భంలో ఉత్సాహంగా యోగాసనాలు నేర్చుకున్నారు. అదే యోగా నేడు వారి వృత్తిగా మారి జీవనోపాధికి దారి చూపింది. ప్రస్తుతం ఈ యువకులు విదేశాల్లో నివసిస్తూ భారతీయ యోగాసనాలు నేర్పిస్తున్నారు. అంతేగాక కాలిఫోర్నియా తదితర యోగా కేంద్రాల్లో యోగాసనాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం 110 మంది యువకులు వియత్నాంలో యోగా శిక్షకులుగా మన దేశ కీర్తిని చాటి చెబుతున్నారు.
వియత్నాంలో యోగా శిక్షకులుగా
రాణిస్తున్న వైనం
కుందగోళ యువకులతో విదేశీయులకు యోగా శిక్షణ

పల్లె నుంచి ప్రపంచ స్థాయికి..