చెరువులో శవమై తేలిన విద్యార్థిని
దొడ్డబళ్లాపురం: పారామెడికల్ విద్యార్థిని చెరువులో శవమై తేలిన ఘటన చెన్నపట్టణ తాలూకా సింగరాజిపుర వద్ద చోటుచేసుకుంది. మద్దూరు తాలూకా అంబరహళ్లి గ్రామానికి చెందిన మహాలక్ష్మి(20) రామనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ కాలేజీలో చదువుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి కనబడకుండా పోయింది. శుక్రవారం ఉదయం చెరువు గట్టుపై విద్యార్థిని ఐడీ కార్డు, బ్యాగ్ లభించాయి. పోలీసులు, అగ్నిమాపకదళం సిబ్బంది గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆత్మహత్య చేసుకుందా? ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిందా? అనే విషయం తెలియాల్సి ఉంది. అక్కూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
థగ్ లైఫ్ ప్రదర్శనపై
20న విచారణ
యశవంతపుర: బహుభాషా నటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనకు భద్రత కల్పించాలని కోరుతూ సినిమా నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. నటుడు కమల్‌హాసన్ తమిళ భాష నుంచి కన్నడ పుట్టినట్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో కన్నడ నాట థగ్ లైఫ్ సినిమా ప్రదర్శనకు భద్రత కల్పించాలని పిటిషన్‌ను దాఖలు చేసింది. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న మధ్యంతర పిటిషన్‌పై అభ్యంతరాలు దాఖలు చేయాలని కన్నడ సాహిత్య పరిషత్‌కు సూచిస్తూ విచారణను వాయిదా వేశారు. గురువారం కోర్టు ప్రారంభం కాగానే కసాప తరపున న్యాయవాది తన వాదనలను వినిపించారు. కమలహాసన్ ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదా? అని జడ్జి ప్రశ్నించగా దీనికి న్యాయవాది లేదని బదులిచ్చారు.
సుప్రీంకోర్టు నోటీసులు
థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకుండా నిషేధించడాన్ని సవాల్ చేస్తూ చలనచిత్ర ప్రదర్శనకు అవకాశం కల్పించాలని కోరుతూ మహేశ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వానికి, కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది.
క్రిమినల్ కేసును రద్దు చేయలేం
● తేల్చి చెప్పిన కర్ణాటక హైకోర్టు
యశవంతపుర: వివాహమైన తరువాత కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ, భరతనాట్య కళాకారిణి అయిన భార్యను వేధిస్తున్న భర్తపై క్రిమినల్ కేసును రద్దు చేయడానికి సాధ్యం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. వివరాలు..2022లో స్నేహితుడి ద్వారా పరిచయమైన వ్యక్తితో 2023 ఆగస్ట్‌లో ఆమెకు వివాహమైంది. ఏడాది కాలంలోనే దంపతుల మధ్య సంబంధం తెగిపోయింది. రాజీ ప్రయత్నాలు చేశారు. పెళ్లి అవ్వగానే భరతనాట్యం చేయవద్దని అత్తమామలు షరతు పెట్టారు. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ దూరంగా ఉంటోంది. చిత్రహింసలకు సంబంధించి వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాఖలైన క్రిమినల్ కేసును కొట్టి వేయాలని భర్త హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.నాగప్రసన్న విచారించారు. భార్యాభర్తల మధ్య వాట్సప్ సందేశాలను జడ్జి విని ఆశ్చర్యానికి గురయ్యారు. అశ్లీలమైన సందేశాలను చదవటానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని జడ్జి నాగప్రసన్న పేర్కొన్నారు. అస్వభావిక లైంగిక క్రియకు భర్త డిమాండ్ చేయడమేగాకుండా భార్యకు పెట్టిన చిత్రహింస, చేసిన దాడిపై ఇచ్చిన డాక్టర్ సర్టిఫికెట్‌ను జడ్జి పరిశీలించారు. భర్త ద్వారా ఏడాది పాటు జరిగిన చిత్రహింసను జడ్జి ఆలకించి భార్యపై మానసిక, శారీరక హింసకు పాల్పడినందున ఈ కేసును ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిటిషనర్ కోరిన ప్రకారం కేసును రద్దు చేయడానికి వీలు కాదని తేల్చారు. కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.


