
ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం
యశవంతపుర: మహిళను వివస్త్రను చేసి సహచరులతో అత్యాచారం చేయించారని బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్న, సహచరులు వసంత్, చెన్నకేశవ, కమల్‌పై అత్యాచారం కేసును ఆర్‌ఎంసీ యార్డ్ పోలీసులు నమోదు చేశారు. 2023లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడారు. దీనితో పాటు అంటువ్యాధి సోకేలా వైరస్ ఇంజక్షన్ వేశారు. దీనివల్ల నాకు జబ్బు సోకిందని ఫిర్యాదులో తెలిపింది. పలు రకాలుగా అసభ్యంగా ప్రవర్తించారు అని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినదానిని ఏకరువు పెట్టారు.
ఫిర్యాదులో ఏముంది?
ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. నేను బీజేపీ మహిళ కార్యకర్తగా పని చేస్తున్నాను. మొదట రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయా, తరువాత జగదీశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తున్నా. 2023లో ఎ1 నిందితుడు మునిరత్న నాపై పీణ్య పోలీసులచే వ్యభిచారం కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తరువాత మునిరత్న సహచరులు, నిందితులు నందినిలేఔట్‌కు వసంత్, చన్నకేశవ, కమల్‌తో కలిసి ఆశ్రయనగరకు చెందిన సునీతబాయి ద్వారా నాపై ఆర్‌ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్‌లో హత్యయత్నం కేసును నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు. 2023 జూన్ 11న నా ఇంటికి వచ్చి కేసులను మునిరత్న వాపస్ తీసుకొంటారని చెప్పారు. యశవంతపుర జేపీ పార్క్ వద్దనున్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని పిలుచుకెళ్లారు, ఆఫీసులో లైంగికదాడి చేశారు, తరువాత నా ముఖంపై మూత్రం పోశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికై నా చెబితే కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించి మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు అని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై ఆర్‌ఎంసీ యార్డ్ పోలీసులు విచారణ చేపట్టారు.
మునిరత్న, అనుచరులపై బీజేపీ
మహిళా కార్యకర్త ఫిర్యాదు

ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం