పిడుగుపాటుకు గురై ఇద్దరు బలి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు గురై ఇద్దరు బలి

May 22 2025 12:25 AM | Updated on May 22 2025 12:25 AM

పిడుగుపాటుకు గురై ఇద్దరు బలి

పిడుగుపాటుకు గురై ఇద్దరు బలి

రాయచూరు రూరల్‌: కల్యాణ కర్ణాటకలోని రాయచూరు, కలబుర్గి జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. బుధవారం సాయంత్రం జిల్లాలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దేవదుర్గ తాలూకా లింగదహళ్లిలో యల్లమ్మ(55) అనే మహిళ గ్రామ శివార్లలోకి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు గురై మరణించారు. లక్ష్మి(28), రామయ్య(30) గాయపడ్డారు. కలబుర్గి జిల్లా అప్జల్‌పుర తాలూకా కర్జిగిలో నబీలాల్‌ సాబ్‌ చౌదరి(70) పిడుగుపాటుకు గురై మరణించారు.

ధార్వాడ జిల్లాలో..

హుబ్లీ: ధార్వాడ జిల్లాలో మంగళవారం పిడుగుపాటుకు గురై ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. చెరువులో ఎద్దులకు స్నానం చేయించడానికి వెళ్లిన యువకుడు పిడుగుపాటుతో మృతి చెందిన ఘటనలో జిల్లాలోని కుందగోళ తాలూకా హిరేనర్తి గ్రామంలో చోటు చేసుకుంది. హిరేహరకుణి గ్రామానికి చెందిన మైలారప్ప(18) అనే యువకుడు తాత ఇంటికి వచ్చిన వేళ ఈ దురంతం జరిగింది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువకుడు మధ్యాహ్నం ఎద్దులను చెరువు దగ్గరకు తీసుకెళ్లగా భారీ వర్షం కురిసింది. దీంతో పక్కన ఉన్న పొలంలోని వేపచెట్టు దగ్గర నిలబడగా పిడుగుపాటుతో మృతి చెందాడు. ఇతడికి కొంచెం దూరంలోనే నిలబడి ఉన్న మంజునాథ్‌ నాయక్‌ను కూడా పిడుగు తాకడంతో గాయాలయ్యాయి. తక్షణమే కుందగోళ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కేఎంసీకి తరలించారు. మృతుడు మైలారప్ప తల్లి ఫిర్యాదు మేరకు కుందగోళ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని పోగొట్టుకున్న తల్లి కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడ ఉన్న వారిని కలచివేసింది. కాగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన కుందగోళ తహసీల్దార్‌ రాజు మాట్లాడుతూ దర్యాప్తు ప్రక్రియ ముగిశాక తక్షణమే జాతీయ విపత్తుల పరిహార నిధి ద్వారా రూ.4 లక్షలు, అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మరో రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

మరో ఇద్దరికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement