
ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాం
హొసపేటె: ఎన్నికల వేళ మేం ఇచ్చిన హామీల్లో ఐదు గ్యారంటీలతో పాటు రెండేళ్లలో 142 హామీలు నెరవేర్చాం. తదుపరి మూడేళ్లలో మిగిలిన హామీలను పూర్తి చేస్తాం అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం నగరంలో ఏర్పాటు చేసిన సమర్పణ సంకల్ప సమావేశంలో 1,11,111 కుటుంబాలకు హక్కు పత్రాలను పంపిణీ చేసి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రతిమను లోకార్పణ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మన రాష్ట్రం అన్ని కులాల శాంతి తోట అని, అందరినీ సమానంగా గౌరవించే రాష్ట్రం అని సీఎం అన్నారు. రాష్ట్రంలో జేడీఎస్, బీజేపీ ఒక్కటయ్యాయన్నారు. అయినా బీజేపీ ఇంతవరకు సొంత శక్తితో అధికారంలోకి రాలేదన్నారు. ఆపరేషన్ కమల చేసి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. 1.22 కోట్ల కుటుంబాలకు గృహలక్ష్మి పథకం కింద రూ.2 వేలను, గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్‌ను, మొత్తం రాష్ట్రంలోని మహిళలకు శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించామని అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు
అంతకు ముందు నగరంలోని బసవేశ్వర సర్కిల్ నుంచి జానపద కళాకారుల బృందం ఊరేగింపును క్రీడా మైదానం వరకు చేపట్టారు. వివిధ తాలూకాల నుంచి వచ్చిన కళాకారులు ఊరేగింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజన వ్యవస్థ కల్పించారు.
సమావేశానికి వర్షం ఆటంకం
సాధన సమావేశానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే సమావేశం ప్రారంభం కాకముందే భారీగా వర్షం కురువడంతో సమావేశం జరుగుతున్న మైదానం తడిసి ముద్దయింది. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలు వర్షం తాకిడితో తడిచి పోయారు. సమావేశం వేదిక లోపలకు వర్షం నీరు చేరింది. భారీ వర్షానికి బ్యానర్లు, కటౌట్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిలా మారింది.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య
సందడిగా సంకల్ప సమావేశం

ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాం

ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాం