
జిల్లా అభివృద్ధికి ప్రాముఖ్యత కల్పిస్తాం
రాయచూరు రూరల్: జిల్లాభివృద్ధికి ప్రాముఖ్యత కల్పిస్తామని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. ఆదివారం సిరవారలో ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు నిజాయతీగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈనెల 20న జరిగే సాధన సమావేశానికి వచ్చే ప్రజలకు పంచ గ్యారెంటీల గురించి వివరించాలన్నారు. ఇళ్లు లేని పేదలకు అశ్రయ పథకం కింద అశ్రయ కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాల్లో వారికి పట్టాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్, బాలస్వామి కొడ్లి, చంద్రశేఖర్, మీనాక్షి, లక్ష్మి, రవిలున్నారు.
పాత్రికేయుల సంచారానికి ప్రత్యేక వాహనం
హుబ్లీ: హుబ్లీలో పని చేస్తున్న పాత్రికేయుల బృందానికి అనుకూలంగా జిల్లా సమాచార శాఖకు కొత్తగా 32 సీట్ల వాహనాన్ని ఇవ్వడానికి టాటా మోటర్స్ కంపెనీ అంగీకరించింది. ఆ మేరకు ఈ నెలాఖరులోగా వాహనాన్ని అందజేస్తారు. సదరు కంపెనీ సామాజిక బాధ్యత నిధుల ద్వారా జిల్లా సమాచార శాఖకు ఈ వాహనాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి గత ఫిబ్రవరిలో సూచించారు. మంత్రి ప్రతిపాదనకు స్పందించిన కంపెనీ టాటా మార్కోపోలో డీలర్ మాణిక్‌బాగ్ ఆటోమొబైల్స్ సంస్థకు ఈ నెలాఖరులోగా వాహనాన్ని ఇవ్వాలని సూచించారు. కాగా తమ విజ్ఞప్తికి స్పందించి పాత్రికేయ బృందానికి కొత్త వాహనం పంపిణీ చేస్తున్న టాటా మోటర్స్ కంపెనీ పాలక మండలికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి కృతజ్ఞతలు తెలిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వ్యక్తిపై దాడి..
అధికారిపై సస్పెన్షన్ వేటు
హుబ్లీ: గదగ్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం రాత్రి కాంగ్రెస్ నేత, డిప్యూటీ తహసీల్దార్ కలిసి యువకుడిపై దాడి చేసిన ఘటనలో గదగ్ జిల్లాధికారి శ్రీధర్ డిప్యూటీ తహసీల్దార్ జీటీ వాల్మీకిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలను వెల్లడించారు. ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా బెటగేరి నాడ కచేరి సదరు జీటీ వాల్మీకి ఈనెల 17న గదగ్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో యువకుడిపై తమ సహచరులతో కలిసి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో జీటీ వాల్మీకి ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు, ప్రభుత్వ విధి నిర్వహణలో లోపానికి పాల్పడినట్లు దృష్టికి రావడంతో సంబంధిత చట్టం ప్రకారం ఆయన్ను సస్పెండ్ చేసినట్లు జిల్లాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సస్పెన్షన్ గడువులో డిప్యూటీ తహసీల్దార్ తమ అనుమతి లేకుండా కేంద్ర స్థానం విడిచి వెళ్లరాదని ఆయన సూచించారు.
చదరంగంతో ఏకాగ్రత సాధ్యం
బళ్లారిఅర్బన్: చదరంగం ఆట పిల్లల్లో ఏకాగ్రతకు దోహద పడుతుంది. ఈ ఆటలో నిపుణులైన పిల్లలు ఎటువంటి క్లిష్ట సమయాల్లోనూ ఆందోళనకు గురికారని, ఈ ఆటను మైండ్ గేమ్‌గా అభివర్ణిస్తారని చెస్ అసోసియేషన్ బళ్లారి జిల్లా అధ్యక్షుడు డీహెచ్‌ఎం విరుపాక్షయ్య తెలిపారు. సోమవారం ప్రైవేట్ హోటల్‌లో అండర్–13, 19 పిల్లలకు ఏర్పాటు చేసిన చెస్ క్రీడా పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. చెస్ ఆట పిల్లలపై సానుకూల పరిణామాలను చూపుతుందన్నారు. అందువల్ల ఈ పోటీల్లో పాల్గొనేలా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. ప్రముఖులు పోలా ప్రవీణ్ మాట్లాడుతూ చదరంగం క్రీడ కోసం ఎలాంటి సహాయానికై నా తాను సిద్ధమని ప్రకటించారు. చెస్ ఆటలో బళ్లారి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కాగా ఈ ఆటలో సుమారు 50 మందికి పైగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కోరి జగదీష్, బసవరాజ్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
నీటి కుంటలో పడి యువకుడి మృతి
హుబ్లీ: వ్యవసాయ పొలంలో తీసిన నీటి కుంటలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ధార్వాడ జిల్లా మారడిగి గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడిని కల్మేశ మల్లప్ప(24)గా గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన వచ్చి కార్యాచరణ చేపట్టి మృతుడి శవాన్ని వెలికి తీశారు. శవాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వైపీఎల్ చాంపియన్ అప్పు బాయ్స్
కోలారు : తాలూకాలోని యానాదిహళ్లి గ్రామంలో నిర్వహించిన యానాదిహళ్లి ప్రీమియర్ లీగ్(వైపీఎల్) క్రికెట్ టోర్నీ సీజన్–4 ఛాంపియన్‌గా అప్పుబాయ్స్ జట్టు నిలిచింది. రెండు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చూపడం ద్వారా అప్పు బాయ్స్ మొదటి బహుమతి సాధించింది. ద్వితీయ బహుమతి అశ్వర్థ్ నేతృత్వంలోని విక్టరీ 11, తృతీయ బహుమతి కిశోర్ నేతృత్వంలోని టాక్సిక్ జట్టు సాధించగా, నాలుగో స్థానంలో శ్రీనాథ్ నేతృత్వంలోని జై శ్రీరాం జట్టు సాధించింది. టోర్నీలో ఉత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చూపిన వివేక్‌కు మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా ఎన్నికయ్యాడు.

జిల్లా అభివృద్ధికి ప్రాముఖ్యత కల్పిస్తాం