
రైతులకు హక్కు పత్రాలు అందించాలి
హొసపేటె: రైతులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హొసపేటెలో ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోనిబసప్ప విలేకరులతో మాట్లాడుతూ విజయనగర జిల్లా మరియమ్మనహళ్లి హోబ్లీ ప్రాంతానికి చెందిన రైతులు తుంగభద్ర నది వరదల కారణంగా ఇళ్లు, మఠాలను కోల్పోయాన్నారు. సుమారు 70 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన భూములను రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. కానీ కొంతమంది రైతులకు హక్కు పట్టాలు అందించలేదన్నారు. అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం వెంటనే స్పందించి హక్కు పత్రాలు అందించి వారి జీవనోపాధిని మెరుగు పరచాలని కోరారు. విజయనగర జిల్లా హగరిబోమ్మనహళ్లి తాలూకాలో ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు నేతలు గంటి సోమశేఖర్, మహబూబ్ బాషా, హుస్సేన్ సాబ్, కనివియప్ప, నగేష్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.