
అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించండి
బళ్లారిఅర్బన్: అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు గ్రాచ్యుటీ చెల్లింపుతో పాటు ఉద్యోగ విరమణ ఒప్పందాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తక్షణమే అమలు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లాధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి అర్కాణి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రికి పంపదలచిన వినతిపత్రాన్ని స్థానిక అధికారి తహసీల్దార్‌కు అందజేశారు. అనంతరం అర్కాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీ్త్ర శిశు అభివృద్ధి శాఖ, సమగ్ర బాల వికాస పథకం ద్వారా నిరుపేద శిశువులు, బాలింతలు, గర్భిణి మహిళల సమగ్ర ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న అంగన్‌వాడీ, రిటైర్డ్ అయిన అంగన్‌వాడీ ఉద్యోగులకు అన్వయించేలా గ్రాచ్యుటీ సౌకర్యాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ.మంగమ్మ, సీడీ మీనాకుమారి, డీ.ఎర్రమ్మ, టి.ఇందిరా, పుష్పావతి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
నేడు బృహత్ రాజయోగ ధ్యానం
హుబ్లీ: గదగ్‌లోని సిద్దరామేశ్వర నగర ఆధ్యాత్మిక సాంస్కృతిక భవనంలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఒత్తిడి లేని జీవితం కోసం బృహత్ రాజయోగ ధ్యాన కార్యక్రమాన్ని చేపడతామని బ్రహ్మకుమారి జయంతి తెలిపారు. గదగ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ అబు పర్వతం రాజయోగిని బ్రహ్మకుమారితో సహా ముఖ్యపాలనాధికారి డీకే.సుదేశ్ జీ ప్రారంభించే ఈ కార్యక్రమంలో ప్రముఖులు డీఆర్ పాటిల్, ప్రసన్నకుమార్ శాబాది మఠ, సవిత సిగ్లి, రాజశేఖర్ బళ్లారి, తాతనగౌడ పాటిల్ తదితరులు పాల్గొంటారన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఈశ్వరీయ జ్ఞానంతో పాటు సహజ రాజయోగ శిక్షణ ద్వారా ప్రపంచంలో సుమారు 140 దేశాల్లో ఈ ఏడాది పూర్తిగా ప్రపంచ ఐక్యత, నమ్మకం కోసం యోగా అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆ మేరకు ప్రజా కార్యక్రమాలు, సదస్సులు, సమ్మేళనాలు, ఎగ్జిబిషన్ ర్యాలీలను దేశ నలుమూలలా ఏర్పాటు చేసి ప్రజల్లో ఆధ్యాత్మిక జాగృతి కల్పించి మనిషి మనసును సద్భావన, సన్మార్గం వైపు మళ్లించేందుకు కృషి చేస్తామన్నారు.
ప్లాస్టిక్ దుకాణాలపై
అధికారుల దాడి
రాయచూరు రూరల్: నగరంలో వివిధ చోట్ల కాలువల్లో, వీధుల్లో ప్లాస్టిక్ కవర్లు అధికం కావడంతో నగరసభ అధికారులు దుఖాణాలపై దాడులు జరిపారు. శనివారం కమిషనర్ జుబీన్ మహాపాత్రో ఆదేశాల మేరకు దాడులు జరిపి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు బేకరీలు, రెండు దుఖాణాలపై దాడులు చేసి లైసెన్సులను రద్దు చేసినట్లు ఆరోగ్య అధికారి శాకీర్ తెలిపారు. ప్లాస్టిక్ కవర్లను ఉత్పత్తి చేసే యూనిట్లపై కూడా దాడులు చేస్తామన్నారు.
సీడబ్ల్యూసీ ఆమోదానికి
19వ గేట్ డిజైన్
హొసపేటె: తుంగభద్ర జలాశయంలో 19వ గేట్ వర్కింగ్ డిజైన్‌ను కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదానికి సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నిపుణులు తుంగభద్ర బోర్డుకు తెలియజేశారు. తుంగభద్ర జలాశయంలో 19వ గేటు వద్ద ఏర్పాటు చేసిన స్టాప్‌లాగ్‌ను తొలగించి క్రస్ట్‌గేట్ ఏర్పాటు చేసే టెండర్‌ను గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్ టూర్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్ కంపెనీ దక్కించుకుంది. ఈ కంపెనీ సమర్పించిన డిజైన్ పరిశీలించిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నిపుణులు డిజైన్‌ను ఆమోదించారు. అయితే కేంద్ర జల సంఘం నుంచి అనుమతి పొందిన తర్వాతే పని చేపట్టాలని వారు సూచించారు. కనుక బోర్డు ఇప్పుడు పని డిజైన్‌ను సమర్పించడానికి సిద్ధమవుతోంది. ఈలోగా 32 గేట్ల టెండర్ ఏ కంపెనీ దక్కించుకుంటుందనే విషయం సోమవారం బయట పడవచ్చని మండలి వర్గాలు తెలిపారు.
హత్యాచార దోషులపై
చర్యకు డిమాండ్
హొసపేటె: ఇటీవల రామనగరలో అమాయక దివ్యాంగురాలైన మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నగర దివ్యాంగుల సంఘం డిమాండ్ చేస్తూ శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. సంఘం నేత వెంకటేష్ మాట్లాడుతూ గ్రామానికి సమీపంలోని రైలు పట్టాల దగ్గర 14 ఏళ్ల మైనర్ బాలికపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన రామనగరలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ ఆశిష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా లోహిత్ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించండి

అంగన్‌వాడీల డిమాండ్లు పరిష్కరించండి