
సాధన సమావేశానికి జోరుగా సన్నాహాలు
హొసపేటె: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈనెల 20న సాధన సమర్పణ సంకల్ప సమావేశాన్ని విజయనగర జిల్లా హొసపేటెలోని పునీత్ రాజ్‌కుమార్ జిల్లా క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు విజయనగర, బళ్లారి జిల్లాల ఇన్‌చార్జి మంత్రి బీజెడ్ జమీర్ అహమ్మద్ ఖాన్ తెలిపారు. శనివారం ఆయన అమరావతి అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. సమావేశానికి సంబంధించిన అన్ని సన్నాహాలు జోరుగా సాగుతున్నాయన్నారు. ఇప్పటికే పనులు పూర్తి దశకు చేరాయన్నాపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 4 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీతో సహా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు. అన్ని పార్టీల నాయకులు, ప్రతిపక్ష నేతలతో సహా ప్రతి ఒక్కరినీ ఆహ్వానించామన్నారు. ఈ సాధన సమావేశానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఆహారం, పార్కింగ్, భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప, డీసీసీ అధ్యక్షుడు శిరాజ్ షేక్, ఏఐసీసీ కార్యక్రమ పరిశీలకుడు రవి బోసురాజు, హుడా చైర్మన్ ఇమాం నియాజీ తదితరులు పాల్గొన్నారు.