
శ్రీగంధం చెట్లకు జియోటాగ్
బళ్లారి రూరల్ : అడవుల్లోను, ప్రభుత్వ భూముల్లో పెరుగుతున్న శ్రీగంధం చెట్లకు జియోటాగ్ వేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే తెలిపారు. గురువారం అటవీ, పర్యావరణ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. శ్రీగంధం చెట్ల్ల దొంగతనాలను నియంత్రించడానికి జియోటాగ్ వేయాలని సూచించారు. శ్రీగంధం చెట్లు అక్రమంగా తరలించకుండా గట్టి భద్రత కల్పించాలన్నారు. ఒక్క చెట్టు కూడా చోరీకి గురికాకుండా చూడాలని సూచించారు. జిల్లాలో సెక్షన్– 4గా ఉన్న రెవిన్యూ భూమిని సెక్షన్– 17గా చేసి అటవీ భూములుగా ప్రకటించడానికి చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. మున్ముందు జరుగనున్న వనమహోత్సవ సందర్భంలో రోడ్లకు ఇరువైపులా ఎత్తైన చెట్లను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. దావణగెరెలో వాయుకాలుష్యం అధికమైనట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వాయుకాలుష్య నియంత్రణకు తగు చర్యలు చేపట్టే క్రమంలో వాయుకాలుష్యాన్ని పరిశీలించి తగ్గించే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. కలుషిత నీటి అవ్యవస్థ, మరణాలను అరికట్టాలని, ఇందుకోసం నీటి స్వచ్ఛతను పరిశీలించాలని తెలిపారు. వాయుకాలుష్య, నిఘా పరీక్ష ప్రయోగశాలను, నర్సరీలను పరిశీలించారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులకు అటవీ మంత్రి ఈశ్వర ఖండ్రే సూచన