
వీడియో కౌన్సిలింగ్ కూడా...
● టెలీ మానస్‌తో మనసు ప్రశాంతం ● సహాయవాణికి ఏటేటా పెరుగుతున్న కాల్స్ ● మానసిక అనారోగ్య సమస్యలకు కౌన్సిలింగ్
సాక్షి బెంగళూరు: ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది.. మనిషి ఈ ప్రపంచంతో పాటు పరుగులు పెడుతున్నాడు. తనకంటూ ఒక జీవితం ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయి పనిలో మునిగి తేలుతున్నాడు. దీంతో చివరికి ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నాడు. అనేక మానసిక సమస్యలకు గురవుతున్నాడు. ఇలాంటివారికి ఉపశమనం కలిగించేందుకు ‘టెలీ మానస్’ ఉపకరిస్తోంది. మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇదొక సహాయవాణి.. జాతీయ మానసిక ఆరోగ్య, న్యూరో సంస్థ (నిమ్హాన్స్) ఈ సహాయవాణిని నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ నిమ్హాన్స్ సహాయవాణికి మానసిక అనారోగ్య సమస్యలతో పరిష్కారాల కోసం కాల్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. రోజూ సుమారు సగటున 3.5 వేల కాల్స్ ఈ సహాయవాణికి వస్తున్నాయి.
ఉత్తమ స్పందన
సహాయ వాణికి కాల్స్ చేసే రోగులకు వారి వివిధ రీతుల మానసిక అనారోగ్య సమస్యలకు ఉచితంగా పరిష్కారాలను, కౌన్సిలింగ్‌ను అందిస్తున్నారు. ఈ టెలీ మానస్‌కు అంతర్జాతీయ సమాచార సాంకేతిక సంస్థ ఐఐఐటీ–బీ సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. మానసిక సమస్యలు, ఒత్తిళ్లకు గురైన వారికి ఉచిత సలహాలు, సమాలోచనలు చేసేందుకు 2022 అక్టోబర్‌లో ఈ టెలీమానస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి టెలీ మానస్‌కు మంచి స్పందన వచ్చింది. మూడేళ్లు కూడా పూర్తి కాకుండానే ఇప్పటికే సుమారు 20 లక్షలకు పైగా కాల్స్ ఈ సహాయవాణికి వచ్చాయంటే ఈ వినూత్న కార్యక్రమం ఎంత విజయవంతం అయిందో అర్థం అవుతోంది.
యువతలోనే ఎక్కువ మానసిక సమస్యలు
వారంలో అన్ని రోజుల్లో 24 గంటల పాటు ఈ టెలీ మానస్ పని చేస్తోంది. 20 భాషల్లో కాల్స్ స్వీకరిస్తున్నారు. బాధలకు గురవుతున్నవారు, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్న వారు, చదువుల్లో ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు చేస్తున్నవారు, మాదకద్రవ్యాల వ్యసనానికి బానిసైన వారు, జ్ఞాపకశక్తి సమస్య ఉన్న వారు, ఆర్థిక ఒత్తిళ్లు కలిగిన వారు ఇలా వివిధ రకాల మానసిక సమస్యలు ఉన్న వారు సహాయవాణికి కాల్స్ చేస్తున్నారు. కాల్స్ వచ్చిన వెంటనే సిబ్బంది స్పందించి ఎంతో ఓపికతో వారితో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని తగు విధంగా కౌన్సిలింగ్, పరిష్కార మార్గాలను బాధితులకు ఇస్తున్నారు. ఇటీవల టెలీ మానస్‌కు వస్తున్న కాల్స్‌లో ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత నుంచే ఉంటున్నాయి.నిద్ర, పరీక్షల ఒత్తిడి సమస్యల గురించి యువత ఎక్కువగా టెలీ మానస్‌ను ఆశ్రయిస్తున్నారు.
తొలుత కేవలం కాల్స్‌కే పరిమితం అయిన టెలీ మానస్ ఆ తర్వాత గత ఏడాది నుంచి వీడియో కౌన్సిలింగ్ సేవలను కూడా ఇవ్వడం ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభం అయిన వీడియో కౌన్సిలింగ్‌కు మంచి స్పందన రావడంతో దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు నిమ్హాన్స్ ఆలోచనలు చేస్తోంది. ప్రతి టెలీ మానస్ కేంద్రంలో నలుగురు వైద్యుల బృందం, 8 మంది కౌన్సిలర్లు పని చేస్తున్నారు. తొలుత కాల్స్ రాగానే వారి మానసకి సమస్య తీవ్రమైనది అయితే వీడియో కాల్‌కు మార్చి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు,జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఈ సేవలను పరిచయం చేశారు. కాగా, ఇప్పుడిప్పుడే మానసిక అనారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, దీంతో సహాయవాణికి వచ్చే కాల్స్ సంఖ్య పెరిగిందని నిమ్హాన్స్ వైద్యులు చెబుతున్నారు.

వీడియో కౌన్సిలింగ్ కూడా...

వీడియో కౌన్సిలింగ్ కూడా...

వీడియో కౌన్సిలింగ్ కూడా...